Friday, November 22, 2024

యమస్పీడుగా సిలబస్‌! విద్యార్థుల్లో పెరుగుతున్న టెన్షన్‌..

ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షల టెన్షన్‌ పట్టుకుంది. ఇంటర్‌ బోర్డు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మొదటి ఏడాది పరీక్షలు ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకు జరగనున్నాయి. ఏప్రిల్‌ 21 నుంచి మే 5 వరకు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా గడువు దగ్గరకు రావడంతో ప్రిపరేషన్‌ హడావుడి పెరిగింది. సిలబస్‌ పూర్తి కాని చోట అదనపు క్లాసులు నిర్వహించి అధ్యా పకులు సిలబస్‌ను చకచకా లాగించేస్తున్నారు. సిలబస్‌ను పూర్తి చేయడంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల కంటే ప్రైవేట్‌ కాలేజీలు కాస్త ముందున్నట్లుగా తెలుస్తోంది. ప్రాక్టికల్‌ పరీక్షలు ఈనెల 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరగనున్నాయి. ఈక్రమంలో సరైన ప్రణాళికతో ప్రిపరేషన్‌ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు గత అక్టోబర్‌లో ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాసిన అనుభవం ఉండటంతో కొంత వరకు పరీక్షలు ఎలా జరుగుతాయన్న అవగాహన వారికి ఉంటుంది. కానీ ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇదే మొదటి బోర్డు పరీక్ష. వీరు టెన్త్‌ బోర్డు పరీక్ష కూడా రాయకుండా కరోనా కారణంగా ప్రమోటై ఇంటర్‌కు వచ్చారు. దీంతో ఇంటర్‌ విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్‌ పట్టుకుంది.

ప్రభుత్వం అటు ఇంటర్‌ పరీక్షలపై ఇటు పదో తర గతి పరీక్షలపై సీరియస్‌గా దృష్టి సారించింది. గత విద్యాసంవ త్సరానికి టెన్త్‌ విద్యార్థులకు ప్రమోట్‌ చేయగా, మార్చిలో నిర్వహించాల్సిన ఇంటర్‌ పరీక్షలను కరోనా కారణంగా అక్టోబర్‌లో నిర్వహించారు. అయితే ఇందులో 49 శాతం మంది మాత్రమే విద్యార్థులు పాసయ్యారు. ఫలితాలపై వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఫెయిలైన వారందరినీ పాస్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించి మంచి ఫలితాలను రాబట్టేందుకు విద్యాశాఖ మరింత దృష్టి సారించింది. వంద శాతానికి దగ్గరగా ఫలితాలు రాబట్టేందుకుగానూ స్పెషల్‌ క్లాసులు నిర్వహించి మరీ విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. 30 శాతం సిలబస్‌ను తగ్గించేసి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ను డబుల్‌ చేశారు. మోడల్‌ పేపర్లను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో విద్యార్థుల కోసం ఇప్పటికే అందుబాటులో ఉంచారు. 70 శాతం సిలబస్‌లో మిగిలిన పాఠ్యాంశాలను ఈ వారం పది రోజుల్లో పూర్తి చేసేసి రివిజన్‌కు వెళ్లేలా సిలబస్‌ బోధనలో అధ్యాపకులు వేగం పెంచినట్లుగా తెలుస్తోంది.

10 నుంచి 15 పిరియడ్లలో బోధించే ఒక పాఠ్యాంశాన్ని కేవలం నాలుగైదు పిరియడ్లలో కాలేజీలు స్పీడ్‌గా లాగించేసేస్తున్నాయి. ఇలా బోధిస్తుండం వల్ల కొంత మంది బిలో యావరేజ్‌ విద్యార్థులు.. ఉపాధ్యాయుల స్పీడ్‌ను అందుకోలేక పోతున్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికోసం పరీక్షల్లో వచ్చే ముఖ్యమైన టాపిక్స్‌ల వారిగా పాఠ్యాంశాలను అధ్యాపకులు బోధిస్తున్నారు. కరోనాకు ముందు సాధారణ రోజుల్లో సిలబస్‌ను వార్షిక పరీక్షలకు ఒక నెల ముందే పూర్తి చేసి రెండు, మూడు సార్లు రివిజన్‌ చేసి నమూనా పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉండేది. ఇది విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ముందస్తుగా ప్రాక్టీస్‌ కూడా కావడంతో పరీక్షల్లో వచ్చే ప్రశ్నలపై అప్పటికే పట్టుసాధించి వార్షిక పరీక్షలు బాగా రాసేవారు. దానికనుగుణంగానే ఫలితాలు కూడా వచ్చేవి. కానీ కరోనా నేపథ్యంలో పరిస్థితులు తారుమారు కావడంతో దాని ప్రభావం ఇంటర్‌ విద్యార్థులపై తీవ్రంగా పడుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement