హైదరాబాద్, ఆంధ్రప్రభ : మనోహరాబాద్ – కొత్తపల్లి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా శరవేగంగా సాగుతున్నాయి. గజ్వేల్ – కొడకండ్ల మధ్య పూర్తయిన రైల్వే లైన్ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. 2006 – 07 సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్ర్‌భుత్వం ఓకే చెప్పింది. అంతే కాదు 151 కిలోమీటర్ల దూరానికి గాను రూ.1160 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు శాఖా పరంగా అన్ని అనుమతులు మంజూరు చేసింది. కాగా వివిధ కారణాలతో ఆలస్యం కావడం ఆ తర్వాత ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 1373కోట్లకు పెంచుతూ సవరణ అనుమతులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేయిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం వ్యయంలో 1/3 వంతును పంచుకోవాల్సి ఉంది. అలాగే మనోహరాబాద్ – కొత్తపల్లి నూతన రైల్వే లైన్ కోసం ఇందుకు అవసరమైన భూమిని ఉచితంగా అందించాల్సి ఉంటుంది. అలాగే ప్రాజెక్టు పనులు ప్రారంభించిన తర్వాత మొదటి 5 సంవత్సరాలకు చెల్లించే ఆ మొత్తాన్ని అందజేయాల్సి ఉంటుంది.
ఐదు దశల్లో ఎంతెంత ??
మనోహరాబాద్ – కొత్తపల్లి నూతన రైల్వే ప్రాజెక్టు 5 దశల్లో అమలు చేయనున్నారు. ఇందులో మొదటి దశలో భాగంగా ఫేజ్ 1 కింద మనోహరాబాద్ – గజ్వేల్ వరకు 32 కిలో మీటర్లు అలాగే ఫేజ్ – 2 కింద గజ్వేల్ – కొడకండ్ల వరకు 12 కిలోమీటర్లు, ఫేజ్ – 3 కింద కొడకండ్ల – దుద్దెడ వరకు 21 కిలో మీటర్లు ఫేజ్ 4 కింద దుద్దెడ – సిద్దిపేట 11 కిలో మీటర్లు అలాగే సిద్దిపేట – సిరిసిల్ల 37 కిలో మీటర్లు , ఫేజ్ – 5 కింద సిరిసిల్ల కొత్తపల్లి 38 కిలో మీటర్లు మేర రైల్వే ట్రాన్ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే వీటిలో మనోహరాబాద్ – గజ్వేల్ మధ్య 32 కిలో మీటర్ల ఫేజ్ -1 సెక్షన్ 2020 ఆగస్టులో పూర్తయింది. ఫేజ్ -2 సెక్షన్ గజ్వేల్ – కొడకండ్ల మధ్య 12 కిలో మీటర్ల దూరం వరకు 2022 ఫిబ్రవరిలో పూర్తయింది. మిగిలిన సెక్షన్ పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. ఇక మేడ్చల్ , సిద్దిపేట , మెదక్ , సిరిసిల్ల & కరీంనగర్ జిల్లాల ప్రజలు హైదరాబాద్ – కరీంనగర్ (మనోహరాబాద్ – కొత్తపల్లి మీదుగా) రైలు మార్గాన్ని భారతీయ రైలు మ్యాప్‌లో ఇప్పటి వరకు ఇంకా చేర్చక పోవడంతో దీనిని కూడా అనుసంధానించాలని ఈ ప్రాంతవాసులు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
ఈ కొత్త లైన్ చాలా కీకలమైనది కూడా. తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాలతో కూడిన ప్రాంతాలను చుట్టుకుంటూ మరీ ముఖ్యంగా దర్శనీయ యాత్రా స్థలాలను చుట్టేసుకుంటూ వెళ్లనుంది. దీంతో ఈ రైలు కనెక్టివిటి కొత్త శకానికి నాంది పలుకుతుందని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. శివుని అనుగ్రహం కోసం వేములవాడకు వెళ్లే లక్షలాది యాత్రికులు అలాగే సిద్దిపేట చేనేత కార్మికులు, గజ్వేల్ వ్యాపార వర్గాల కోం ఈ ప్రాజెక్టు ప్రయాణ సౌలభ్యంతో కొత్త ఒరవడికి నాందికానుంది. ఈ కొత్తలైన్ పూర్తయిన తర్వాత ఇది రవాణా రంగం అభివృద్ధికి ఒక ముందడుగు మాత్రమే కాకుండా మొటో నగరాలకు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మరియు సులభంగా చేయడం ద్వారా అనేక మందికి సాధికారతకు మూలం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనుల ద్వారా ఈ ప్రాంతంలోని పలు వర్గాల ప్రజలకు ఉపాధి లభించనుంది.