Saturday, November 23, 2024

రామాయపట్నం పోర్టును త్వరగా పూర్తి చేయండి : ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన విభజన హామీ మేరకు రామాయపట్నం ఓడరేవును త్వరగా నిర్మించాలని వైఎస్సార్సీపీ నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్‌ చేశారు. మొదట ఈ పోర్టును దుగరాజపట్నంలో నిర్మించాలనుకున్నా స్థలం విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. పోర్ట్ కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 3 వేల ఎకరాలను గుర్తించినా కేంద్రం వైపు నుంచి జాప్యం జరుగుతోందని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. ఓడరేవుల పరిశ్రమలో మనదేశం 18వ స్థానంలో ఉందని, ఇది ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్, పీఎల్‌ఐ, మానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ తదితర అంశాల వల్లే సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ఓడరేవులు, షిప్పింగ్‌ శాఖకు గతేడాదితో పోల్చుకుంటే 33 శాతం నిధులు తగ్గించాని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సాగరమాల కార్యక్రమానికి కేవలం రూ.360 కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. అలాగే మైనర్‌ పోర్టుల అభివృద్ధికి రూ.128 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికి రూ.52.79 కోట్లు మాత్రమే మంజూరు చేశారని శ్రీకృష్ణ అన్నారు.

ఓడరేవులను సజావుగా నిర్వహించడానికి అన్ని అనుమతులు సకాలంలో అందించే సింగిల్‌ విండో పాలసీని రూపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైనా భారతీయ ఓడరేవులో పని చేయడానికి ఒక దేశం, ఒక రిజిస్ట్రేషన్ విధానం కూడా అవసరమని ఎంపీ నొక్కి చెప్పారు. గిడ్డంగులు, స్టోరేజ్‌ల వంటి వాటితో పోర్టు నగరాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఓడరేవుల వద్ద జాప్యం, అధిక పన్నులు, ఖర్చుల వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. కోస్టల్‌ బెర్త్‌ స్కీం కింద పోర్టులను అభివృద్ధి చేయాలని కేంద్ర యోచిస్తున్నా అమలులో మాత్రం జాప్యం జరుగుతోందని ఆయన వివరించారు. 7500కి.మీ తీర ప్రాంతం కలిగి ఉన్న మనదేశంలో తీరప్రాంతాలను, మేజర్, నాన్ మేజర్‌ పోర్టులను అభివృద్ధి చేయాలని సూచించారు. నదులు, కాలువల ద్వారా కూడా సరుకు రవాణాకు చర్యలు చేపట్టాలని ఎంపీ శ్రీకృష్ణదేవరయాలు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement