Tuesday, November 26, 2024

అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణాన్ని పూర్తి చేయండి.. ఢిల్లీ పర్యటన ముగించుకున్న అమరావతి జేఏసీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని అమరావతి జేఏసీ వెల్లడించింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అక్కడే స్థలాలు పొందిన కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ బిల్డ్ అమరావతి పేరుతో అమరావతి జేఏసీ నాయకులు, రాజధాని రైతు పరిరక్షణ సమితి ప్రతినిధులు ఢిల్లీ పర్యటన చేపట్టారు. మూడు రోజుల పర్యటనలో వారు పలువురు కేంద్ర మంత్రులను, వివిధ పార్టీల నాయకులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. వారి గోడు వెళ్లబోసుకున్నారు. మొదటిరోజు కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నారాయణ రాణే, డిఓపీటీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, రైల్వే, టెలికం శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, డీఎంకె ఎంపీ తిరుచ్చిశివ, బీజేపీ జాతీయ కార్యదర్శ సత్యకుమార్‌, కాంగ్రెస్‌ నేత కొప్పుల రాజులను జేఏసీ ప్రతినిధులు కలిశారు. బుధవారం కేంద్ర అటవీ, పర్యావరణ, కార్మిక శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్‌, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, పట్టణాభివృద్ది, పెట్రోలియం శాఖల మంత్రి హర్దీప్‌ సింగ్ పూరి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎంపీ రఘురామకృష్ణరాజులతో సమావేశమై అమరావతి అంశంపై మద్దతు కోరారు. గురువారం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి, సమాచార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీలను కలిశారు. క్రీడా శాఖ నుంచి ఇప్పటికే స్థలాన్ని పొందిన పలు సంస్థల కార్యకలాపాలు ప్రారంభించాలని, నిర్మాణాలు చేపట్టాలని జేఏసీ నాయకులు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కోరారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు అమరావతి రాజధానిలో దాదాపు ఏడు ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించారని మంత్రికి వివరించారు. అమరావతిలో 90 శాతం భూములు రెండెకరాలలోపు ఇచ్చిన రైతులే ఉన్నారని అనురాగ్‌ ఠాకూర్‌ దృష్టికి తీసుకొచ్చారు. మూడేళ్ల నుంచి అమరావతి నిర్మాణాలు ఆగిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిపై ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రమంత్రికి వివరించారు.

అనంతరం అమరావతి రాజధాని రైతులు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. చిలుకలూరిపేట వరకు నిలిపివేసిన జాతీయ రహదారిని అమరావతికి ఎక్స్‌ప్రెస్‌వేగా అనుసంధానం చేయాలని రైతులు విన్నవించారు. కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయాలని, నూతన రాజధాని నిర్మాణానికి తోడ్పడాలని కోరగా… గడ్కరీ సానుకూలంగా స్పందించారని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తెలిపారు.

అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాల్సిన బాధ్యత సీఎం జగన్‌ పై ఉందని, ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఆ బాధ్యత కేంద్రంపై కూడా ఉందని కేంద్ర మంత్రికి వివరించామని ఆమె అన్నారు. అమరావతిలో 10 వేల కోట్లతో చేపట్టిన నిర్మాణాలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ తీరుతో రాజధాని రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అన్నదాతలను రోడ్ల మీద నిలబెట్టారని పద్మశ్రీ విమర్శించారు.

మూడు రోజుల ఢిల్లీ యాత్ర ముగించుకుని అమరావతి జేఏసీ నాయకులు విజయవాడ తిరిగి బయల్దేరారు. వారికి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వీడ్కోలు పలికారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement