Sunday, November 24, 2024

TS | వర్షాలపై ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించాలి : సీఎం రేవంత్

హైదరాబాద్‌తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షం పడుతున్న సమయంలోనే సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి వెళ్లారు. అన్ని విభాగాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలో వర్షం ప్రభావం ఉన్న ప్రాంతాలపై ఆయన ఆరా తీశారు.

వర్షాలు, వర్షం తర్వాత ఏర్పడే పరిస్థితులపై అధికారులతో చర్చించారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల పడ్డ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న విషాద ఘటనల గురించి కూడా చర్చించారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో అదికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బంజారాహిల్స్, సచివాలయం, అమీర్ పేట, కూకట్‌పల్లి, హిమయత్ నగర్, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో మోకాలు లోతు వరకు నీరు నిలిచింది. దాదాపుగా ఉద్యోగస్తులు అంతా ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగు పయనం అవుతున్న సమయం కావడంతో.. నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement