గత నెల సెప్టెంబర్ లో జరిగిన ఆపిల్ ఈవెంట్ లో కంపెనీ ఐ ఫోన్ 15 సిరీస్ ని గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రొ మాక్స్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే, లాంచ్ అయిన నెలలోపే ఈ ఫోన్లపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. తాము రీసెంట్ గా కొనుగోలు చేసిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో హీటింగ్ సమస్య, ఆడియో సమస్య ఉందని, తమ ఫోన్లను రీప్లేస్ చేయాలని కోరుతూ చాలా మంది వినియోగదారులు యాపిల్ సంస్థకు ఈమెయిల్స్ చేశారు. కానీ యాపిల్ సంస్థ నుంచి ఎలాంటి సానునకూల స్పందన రాలేదు.
ఐఫోన్ 15 ఫోన్లలో ప్రధానంగా చాలా మంది వినియోగదారులు హీటింగ్ సమస్యను గుర్తించారు. ఫోన్ తీవ్రంగా వేడెక్కడం, ముఖ్యంగా చార్జ్ చేస్తున్న సమయంలో డివైజ్ వేడిగా మారిపోవడం వంటి సమస్యలను వినియోగదారులు ప్రస్తావించారు. ఐఫోన్ 15 స్టాండర్డ్ మోడల్స్ అన్నీ డైనమిక్ ఐలండ్ ఫీచర్ ను కలిగి ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రొ మోడల్స్ మాత్రం టైటానియం ఫ్రేమ్ కలిగి ఉంది. ఇప్పుడు ఈ హీటింగ్ సమస్య అన్ని ఐఫోన్ 15 మోడల్స్ లో కూడా ఉందని, కానీ ఐఫోన్ 15 లో ఎక్కువగా కనిపిస్తోందని తెలుస్తోంది. ఎక్కువ ఫిర్యాదులు కూడా ఐఫోన్ 15 యూజర్ల నుంచే వస్తున్నాయి.
ఇక అదే కాకుండా.. తాజాగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల యూజర్లు మరో సమస్యను లేవనెత్తారు. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో ప్రధానంగా ఐఫోన్ 15 ప్రొ మోడల్స్ లో స్పీకర్ నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఎక్కువ వ్యాల్యూమ్ లో ఉన్నప్పుడు ఈ శబ్ధాలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయని వివరిస్తున్నారు. కాల్స్ సమయంలో కానీ, మ్యూజిక్ ప్లే అవుతున్న సమయంలో కానీ ఆడియో స్పష్టంగా ఉండడం లేదని చెబుతున్నారు. యాప్స్ వాడుతున్న సమయంలో కూడా వింత సౌండ్స్ వస్తున్నాయని చెబుతున్నారు.