Friday, November 22, 2024

కొత్తకోట సీఐపై జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఓ వ్యక్తిని చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో వనపర్తి జిల్లా కొత్తకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై జాతీయ బీసీ కమిషన్‌కు బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మునిగిల్ల గ్రామానికి చెందిన బాధితుడు శివకుమార్‌ను వెంటతీసుకుని ఢిల్లీ చేరుకున్న బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్, పోలీసులు వ్యవహరించి తీరుపై కమిషన్‌ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో శివకుమార్‌ను అక్రమంగా నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేశారని యుగంధర్ గౌడ్ వివరించారు. ఈ దాడికి పాల్పడ్డ కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కమిషన్‌ను కోరారు.

అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో పోలీసు అధికారులు నాయకుల మెప్పు కోసం ప్రజల హక్కులు కాలరాస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. బాధితుడు శివకుమార్ ఫిబ్రవరి 22న తన పొలం పనుల్లో ఉండగా కానిస్టేబుల్ శివ యాదవ్ ఫోన్ చేసి, తన వెంట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారని, వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితుడు శివకుమార్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని చెప్పారు. ఈ దుశ్చర్యపై జిల్లా ఎస్పీకి, డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, అందుకే తాము జాతీయ బీసీ కమిషన్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని యుగంధర్ గౌడ్ తెలిపారు. చట్టాన్ని మీరి ప్రవర్తించిన సీఐ శ్రీనివాస రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిర్యాదుతో పాటు రిమాండ్ రిపోర్ట్, దినపత్రికల క్లిప్పింగులను జతపరిచామని వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement