Saturday, November 23, 2024

Delhi | పోలీసులపై కేంద్రానికి, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు.. కిషన్‌రెడ్డి అరెస్టును ఖండించిన ఎంపీ బండి సంజయ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అరెస్టు వ్యవహారంలో పోలీసుల తీరుపై కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన ఆయన గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీసులు అక్రమంగా కిషన్‌రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన చేస్తున్నా సరే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

డబుల్ బెడ్రూం కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని కట్టారు? ఎన్ని ఇచ్చారు? ఇంకా ఎన్ని కట్టాలి? అనే దానికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన గృహాలను నిర్మించానంటూ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని ఆయన అన్నారు. లబ్ధిదారుల జాబితా ఇవ్వమంటే మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం కట్టించానని చెప్పిన ఇళ్లను చూడడానికి తమ వెళ్తుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీశారు.

- Advertisement -

ఇళ్లను చూడడానికే కదా వెళ్తున్నది? కూలగొట్టడానికేమీ కాదు కదా అని ఎద్దేవా చేశారు. తాను, తన భార్య మాత్రమే ఉంటానని చెప్పిన మోనార్క్ ముఖ్యమంత్రి వంద గదుల్లో గడీ ఎందుకు కట్టారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తమ నేతలను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. కేంద్రమంత్రి అరెస్ట్ ద్వారా ప్రభుత్వం ఏమీ సాధించలేదని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. పోలీస్ అధికారుల తీరుపై విచారణ జరుగుతోందని సంజయ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement