న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం హస్తినలో ప్రయత్నాలు మొదలయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రతి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. జనరల్ నియోజకవర్గాల్లోనే కాదు, రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ ఈ పోటీ కనిపిస్తోంది. అలాంటివాటిలో తుంగతుర్తి నియోజకవర్గం ఒకటి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్ మరోసారి టికెట్ ఆశిస్తుండగా.. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ నగరిగారి ప్రీతమ్ కూడా ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు.
ఎవరికి వారు తమ ప్రయత్నాలు గట్టిగా సాగిస్తున్న వేళ, కొత్తగా ఈ స్థానం కోసం ఓ మహిళా జర్నలిస్టు పేరు తెరపైకి వచ్చింది. నియోజకవర్గానికి చెందిన సురారపు కృష్ణవేణి ఇస్మాయిల్ టికెట్ ఆశిస్తూ ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణవేణి ఫౌండేషన్ పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలు, నియోజకవర్గంలో తనకున్న పట్టు గురించి ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలకు వివరిస్తూ టికెట్ కోరుతున్నట్టు సమాచారం.