Tuesday, November 26, 2024

విదేశీ బ్రాండ్లకు పోటీ రిలయన్స్‌ కాంపా డ్రింక్‌

మన దేశ సాఫ్ట్‌ డ్రింక్‌ మార్కెట్‌లో చాలా సంవత్సరాలుగా విదేశీ బ్రాండ్లదే ఆధిపత్యం. కోకాకోలా, పెప్సీ వంటి బ్రాండ్లదే మార్కెట్‌లో హవా. సరళీకరణ విధానాలతో మన దేశ మార్కెట్లోకి వచ్చిన ఈ బ్రాండ్స్‌ క్రమంగా పూర్తి పట్టుసాధించాయి. ప్రస్తుతం రిలయన్స్‌ కంపెనీ ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన డ్రింక్‌ కాంపాను కొనుగోలు చేసి, మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నారు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఈ డ్రింక్‌ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు. ఇటీవల కోలాతో పాటు లెమన్‌, అరెంజ్‌ రుచుల్లో డ్రింక్‌ను తీసుకు వచ్చారు. మార్కెట్‌లో భారీ ఎత్తున ప్రవేశించడం ద్వారా ప్రస్తుతం ఉన్న బ్రాండ్స్‌కు పోటీ ఇవ్వాలని రిలయన్స్‌ భావిస్తోంది.

టెలికం మార్కెట్‌లో ఉచిత కాల్స్‌తో మార్కెట్‌లో ప్రవేశించి అనతి కాలంలోనే జియో బ్రాండ్‌ను అగ్రస్థానానికి చేర్చింది. ఇదే వ్యూహాన్ని అనుసరించి సాఫ్ట్‌ డ్రింక్‌ మార్కెట్‌లోనూ వాటా పెంచుకోవాలని రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌ భావిస్తోంది. ధరలు తగ్గించి, తమకు ఉన్న రిటైల్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. స్వదేశీ బ్రాండ్‌ అన్న ప్రచారం కూడా చేయనుంది. గత సంవత్సరం రిలయన్స్‌ కాంపా బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఉత్పత్తి చేస్తోంది.

సొంతంగానే ప్లాంట్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా భారీ ఎత్తున సాఫ్ట్‌ డ్రింక్స్‌ను ఉత్పత్తి చేయాలని రిలయన్స్‌ భావిస్తుంది. రిలయన్స్‌కు దేశవ్యాప్తంగా 2,500 వరకు రిటైల్‌ స్టోర్స్‌ ఉన్నాయి. జియో మార్ట్‌ యాప్‌ ద్వారా కూడా ఈ సాఫ్ట్‌ డ్రింక్‌ అమ్మకాలు పెంచుకోనుంది. కాంపాను రిలయన్స్‌ గ్రేట్‌ ఇండియన్‌ టేస్ట్‌, రిచ్‌ హెరిటేజ్‌ పేరుతో ప్రమోట్‌ చేస్తోంది. విదేశీ బ్రాండ్లకు అలవాటుపడిన కస్టమర్లు ఏ మేరకు రిలయన్స్‌ డ్రింక్‌ పట్ల ఆదరణ చూపుతారో చూడాలని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement