Friday, November 22, 2024

సింగపూర్‌తో పోటీ, బెంగళూరుతో కాదు.. ష్యూరిఫై ల్యాబ్స్‌ ప్రారంభంలో కేటీఆర్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ పోటీ బెంగళూరుతో కాదని సింగపూర్‌ మలేషియా లాంటి దేశాలతోనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రత్యర్థి బలంగా ఉంటేనే ఎదుగుదల ఉన్నతంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని మైహోం ట్విట్జాలో సోమవారం కొలియర్స్‌, కాలిఫోర్నియాకు చెందిన ఇన్సూర్‌టెక్‌ కంపెనీ ష్యూరిఫై ల్యాబ్‌ ఐటీ సంస్థల కార్యాలయాలను రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాగ్యనగరంలో ఐటీ ఉద్యోగులు కొవిడ్‌ వల్ల హైబ్రిడ్‌ విధానంలో పనిచేస్తున్నా ఫలితాలు, సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు ఏ మాత్రం తగ్గట్లేదని పేర్కొన్నారు. ఐటీ కార్యకలాపాలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాదని, టైర్‌-2 పట్టణాల్లోనూ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని ఐటీ కంపెనీలు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో తమ కార్యాలయాలు ఏర్పాటుచేయడంపై దృష్టిసారించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఆ సంస్థ ప్రతినిధులను కోరారు.

ఏడేళ్ల క్రితం ఘ్యూరిఫై సంస్థలో ఒక ఉద్యోగి మాత్రమే ఉంటే ఇప్పుడు 200 మంది ఉన్నారని తెలిపారు. ‘ఈ కంపెనీకి వస్తే ఐటీ కంపెనీకి వచ్చినట్లు లేదు. దసరా, దీపావళి పండుగ జరుపుకున్నట్లు ఉంది. అందరు సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పరిశ్రమలు నెలకొల్పడానికి హైదరాబాద్‌ మహానగరం దేశంలోకెల్లా సౌకర్యవంతమైన నగరం. ఇక్కడ అద్భుతమైన మౌళిక సదుపాయాలున్నాయి. బలమైన ప్రత్యర్థితో పోటీ పడితేనే మన ఎదుగుదల ఉన్నతంగా ఉంటుంద’ని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలోనే సింగపూర్‌ స్థాయికి హైదరాబాద్‌ను తీసుకురావడంలో కేటీఆర్‌ పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కేటీఆర్‌ ముందు చూపు వల్లే భాగ్యనగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఇక్కడ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ లేదని కేసీఆర్‌ ముందు చూపు తెలివితేటల వల్లే ప్రస్తుతం హైదరాబాద్‌ అద్భుతంగా ఉందని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్లే తెలంగాణకు అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయని సైయింట్‌ సంస్థ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ష్యూరిఫై సంస్థ సీఈవో డస్టిన్‌ యోడర్‌ మాట్లాడుతూ తాము రూపొందించే టెక్నాలజీతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ సేవలను అందిస్తామని తెలిపారు. ఇప్పటికే తమకు హైదరాబాద్‌లో రెండు కార్యాలయాలున్నాయని తాజాగా ప్రారంభించింది మూడో కార్యాలయమని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement