Friday, November 22, 2024

మ‌రో రెండు రోజుల్లో కామన్వెల్త్‌ గేమ్స్.. భారతపై గంపెడాశలు

అంతర్జాతీయ క్రీడా సంరంభం… కామన్వెల్త్‌ గేమ్స్‌ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు 72 దేశాల నుంచి ఐదు వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. దాదాపు 25 క్రీడాంశాల్లో పోటీలు జరుగనున్నాయి. 215మంది క్రీడాకారులు 19 క్రీడా విభాగాలతోపాటు 141 ఈవెంట్స్‌లో భారత్‌ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ మహా క్రీడా మేళా కోసం ఇప్పటికే వివిధ దేశాల నుంచి క్రీడాకారులు బర్మింగ్‌హోమ్‌లోని క్రీడా గ్రామానికి చేరుకున్నారు. క్రీడాకారుల సందడి మొదలైంది. కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభ వేడుకలకు సంబంధించి రిహార్సల్స్‌ ఓ వైపు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున ప్రారంభ వేడుకల ఏర్పాట్లు చేశారు. ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత బృందంపై దేశం యావత్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 22వ మహా క్రీడా మేళాలో భారత్‌కు పతకాల పంట ఖాయమని అభిమానులు ఆశతో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ను పరిశీలిస్తే… పతకాల పట్టికలో ఆస్ట్రేలియా 2,415 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా, భారత్‌ 503 పతకాలతో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో సుమారు 25కు పైగా క్రీడాంశాలున్నా… భారత్‌ సుమారు 20 క్రీడల్లో పాల్గొంటున్నా ఆరు ఈవెంట్లలో మాత్రమే పతకాలు సాధించే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి.

షూటింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌ విభాగాల్లోనే స్వర్ణ పతకాలు ఖాయం. ఇక మిగిలిన క్రీడల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదనేది చరిత్ర చెబుతున్న సత్యం. కామన్వెల్త్‌తో భారత్‌ షూటింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌ విభాగాల్లో టాప్‌లో దూసుకెళ్తుంటే మిగిలిన క్రీడాంశాల్లో ఆశాజనక ఫలితాలు సాధించడం లేదు. భారత్‌ ఇప్పటి వరకు ఈ క్రీడలలో 503 పతకాలు సాధించగా… అందులో షూటింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌ విభాగాల్లో సాధించిన మెడల్స్‌ 362 ఉన్నాయి. అత్యధిక స్వర్ణాలు కూడా ఆ మూడు విభాగాల్లో ఉన్నవే. షూటింగ్‌లో భారత జట్టుకు విశ్వవేదికల్లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు కామన్వెల్త్‌తో 63 స్వర్ణాలు, 44 రజతాలు, 26 కాంస్యాలు సాధించారంటే… భారత్‌ షూటింగ్‌లో ఏస్థాయిలో రాణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విభాగంలో భారత షూటర్లు గురి తప్పడం లేదు. మొత్తంగా షూటింగ్‌లోనే భారత్‌ 133 పతకాలు అందుకుంది. షూటింగ్‌లో అత్యంత విజయవంతమైన దిగ్గజ షూటర్‌ జస్పాల్‌ రాణా. కామన్వెల్త్‌ క్రీడలలో ఏకంగా 15 పతకాలు నెగ్గాడు. షూటింగ్‌ తర్వాత వెయిట్‌ లిఫ్టింగ్‌లో కూడా మన క్రీడాకారులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు.

ఇప్పటి వరకు వెయిట్‌ లిఫ్టింగ్‌లో 125 పతకాలు సాధించింది. అందులో 43 స్వర్ణాలు, 48 రజతాలు, 34 కాంస్యాలున్నాయి. రెజ్లింగ్‌లో కూడా భారత్‌ అనుకున్న దానికంటే అద్భుతంగా రాణిస్తున్నది. మన కుస్తీ వీరుల పట్టుకు పతకాలు దాసోహమవుతున్నాయి. ఇప్పటి వరకు రెజ్లింగ్‌లో భారత జట్టుకు 102 పతకాలు రాగా, అందులో 43 స్వర్ణాలు, 37 రజతాలు, 22 కాంస్యాలు దక్కాయి. కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం రెజ్లింగ్‌లోనే దక్కింది. 1934లో రెజ్లర్‌ రషీద్‌ అన్వర్‌ రెజ్లింగ్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. వీటితోపాటు బాక్సింగ్‌లో 37పతకాలు, బ్యాడ్మింటన్‌లో 25, టేబుల్‌టెన్నిస్‌ 20 పతకాలు సాధించింది.అయితే అథ్లెటిక్స్‌లో మాత్రం మనోళ్లు అంతగా రాణించడం లేదు. 1958లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో మిల్కాసింగ్‌ 440 మీటర్ల పరుగు పందెంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. ఆ తర్వాత 2010 వరకు రజత, కాంస్యాలు చేజిక్కించుకుంటున్నా బంగారు పతకం మాత్రం తీసుకురాలేకపోయారు. అథ్లెటిక్స్‌లో భారత్‌ ఇప్పటివరకు ఐదు బంగారు పతకాలు మాత్రమే సాధించింది. వీటితోపాటు హాకీ, ఆర్చరీ, టెన్నిస్‌, జూడో, జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌ విభాగాల్లో కూడా భారత్‌ బృందం రాణించాల్సి ఉంది. ఆ దిశగా సాగుతూ ఈసారి మరిన్ని పతకాలు చేజిక్కించుకుని వస్తారని యావత్‌ దేశమంతా ఎదురుచూస్తోంది. గురువారం నుంచి ప్రారంభం కాబోతున్న 22వ కామన్వెల్త్‌ గేమ్స్‌లో మన క్రీడాకారులు ఏ మేరకు మెరుస్తారో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement