Thursday, November 21, 2024

అసెంబ్లీ ఎన్నికల తరువాతే ఎంఎస్‌పీపై కమిటీ.. ఎన్నికల సంఘానికి కేంద్రం లేఖ..

న్యూఢిల్లీ : కనీస మద్దతు ధరపై.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుతం కట్టుబడి ఉందనీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాతే ఎంఎస్‌పీపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తోమర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక పార్లమెంట్‌ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఎంఎస్‌పీ కమిటీపై స్పష్టత ఇచ్చారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఎంఎస్‌పీపై తీసుకునే నిర్ణయం గురించి లేఖ రాసిందన్నారు.

కమిటీ ఏర్పాటు చేసే అంశం మంత్రిత శాఖ పరిశీలనలో ఉందన్నారు. పంటల వైవిధ్యం, సహజ వ్యవసాయం, పంటకు కనీస మద్దతు ధరను కల్పించే విషయమై.. సమర్థవంతంగా.. పారదర్శకం.. చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారని, ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు అన్నారు. ప్రధాని చేసిన ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో.. ప్రభుత్వం మార్గదర్శకత్వం కోసం ఈసీకి లేఖ రాశామన్నారు. దీనికి ఈసీ సమాధానం కూడా ఇచ్చిందన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాతే కమిటీ ఏర్పాటు చేయాలని సూచించిందని తోమర్‌ తెలిపారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు ఉద్యమించిన విషయం తెలిసిందే. కేంద్రం వెనక్కి తగ్గి.. చట్టాలను ఉప సంహరించుకోగా.. ఎంఎస్‌పీపై కమిటీ వేసేందుకు నిర్ణయించింది. ఎంఎస్‌పీపై చట్టం తీసుకొస్తామని, దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతోనే రైతులు తమ ఆందోళనలు విరమించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement