ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోవడానికి, అగ్నికి ఆహుతి అవ్వడానికి గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ ఓ నిర్ధారణకు వచ్చింది. ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి బ్యాటరీ సెల్స్, మాడ్యూల్స్ లోపభూయిష్టంగా ఉండటమే అని ప్రాథమిక ఫెడరల్ పరిశోధన ప్రకారం వెల్లడైంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు మూడు కంపెనీలకు చెందిన ఈవీలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ద్వారా దర్యాప్తు చేస్తున్నది. ఓలా ఎలక్ట్రిక్ ఏప్రిల్ 2022లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఈ-స్కూటర్ తయారీదారుగా ఉంది. ఓలా విషయంలో బ్యాటరీ సెల్‌తో పాటు బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో లోపాలు కూడా వాహనం కాలిపోయేందుకు కారణమని కమిటీ తేల్చింది. ఈ మేరకు తనిఖీల కోసం ప్రభుత్వం మూడు కంపెనీల నుంచి బ్యాటరీల నమూనాలను తీసుకుంది. విచారణకు సంబంధించిన తుది నివేదిక రెండు వారాల్లో వెలువడనున్నట్టు సంబంధిత వర్గాల నుంచి తెలుస్తున్నది.
భారీగా పెరిగిన ఈవీ అమ్మకాలు..
దేశంలో ఈ-స్కూటర్లు, ఈ-బైక్‌లను 2030 నాటికి 2 శాతం నుంచి 80 శాతం మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఉండాలని ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. ఏదేమైనప్పటికీ.. భద్రతాపరమైన ఆందోళనలు వినియోగదారుల ఈవీలపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశాయి. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఈవీల వినియోగం పెంచాలని భారత్ ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ సమస్యలను నివారించేందుకు అసలు ఎలక్ట్రిక్ వాహనాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలపై కేంద్రం రెండు నెలల క్రితమే దర్యాప్తు కమిటీని నియమించింది. ఇదే సమయంలో ఓలా కూడా ఈ సమస్యపై ప్రభుత్వం కలిసి పని చేస్తున్నది. అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతున్నదనే విషయాన్ని తెలుసుకునే పనిలో పడింది. ఎల్‌జీ ఎనర్జీ సొల్యూషన్స్ (ఎల్‌జీఈఎస్) అనే దక్షిణ కొరియా కంపెనీ నుంచి ఓలా తన ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీలను కొనుగోలు చేస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..