న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల చివరి రోజైన బుధవారం తెలంగాణ భవన్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా.మందా జగన్నాథం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జాజులతో కలిసి ముందుగా భవన్ ప్రాంగణంలోని అమరవీరుల స్తూపం వద్ద, తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అమర వీరుల సృత్యర్ధం రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ అమరుల సంస్మరణ తీర్మానానికి అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా మందా జగన్నాథం మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. ఇప్పటికీ ఉద్యమ రోజులు గుర్తు వస్తే బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీర మరణం పొందిన వారి కోసం ఏం చేసినా తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ అమరుల కుటుంబాలకు అండగా నిలబడ్డారని, ఆర్థిక సహాయం అందించారని ఆయన తెలిపారు. అమరుల త్యాగాలను స్మరించుకునేందుకు హైదరాబాద్‌లో మహాస్మృతి కేంద్రాన్ని, స్మృతివనాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిందని జగన్నాథం చెప్పారు.