Tuesday, November 26, 2024

Delhi: విశాఖ శారదా పీఠం రాజశ్యామల మహోత్సవాలకు రండి.. కేంద్ర మంత్రి నిర్మలకు ఆహ్వానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలో నిర్వహిస్తున్న శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో సీతారామన్‌ను కలిసి ఈనెల 26వ తేదీ నుంచి జరగనున్న ఉత్సవాల్లో పాల్గొనాలంటూ ఆహ్వానపత్రికను అందజేశారు. నిర్మలా సీతారామన్‌కు రాజశ్యామల అమ్మవారి ప్రసాదంతో పాటు ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని బహూకరించారు.

స్వధర్మ వాహిని సంస్థ ద్వారా శారదా పీఠం చేపట్టనున్న ధర్మ ప్రచారం గురించి స్వాత్మానందేంద్ర ఆమెకు వివరించారు. గిరిజన తండాలు, దళిత వాడల్లో ధర్మ ప్రచారం కోసం రూపకల్పన చేసిన ప్రణాళికపై చర్చించారు. స్వధర్మ వాహిని సంస్థకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు. పూజాదికాల నిర్వహణపై మత్స్యకారులు, గిరిజనులకు ప్రత్యేక తర్ఫీదునిస్తున్నట్లు ఆయన తెలిపారు. కోస్టల్‌ కారిడార్‌ వెంబడి మత్స్య నారాయణుడి ఆలయాలను నిర్మించడం ద్వారా ఆయా వర్గాలపై అన్య మతాల ప్రభావం తగ్గుతుందని స్వాత్మానంద సూచించారు.

స్వామీజీని కలిసిన ఉన్నతాధికారులు
ఢిల్లీ పర్యటనలో ఉన్న స్వాత్మానందేంద్ర సరస్వతిని పలువురు ఉన్నతాధికారులు కలిశారు. రక్షణ శాఖ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ సతీష్‌ రెడ్డి, విదేశీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి రమేష్‌ చంద్ర, ఏపీ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌, అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాన్షు కౌశిక్‌, జాతీయ పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలవర్థన్‌రావు, పంజాబ్‌ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శివప్రసాద్‌ తదితరులు స్వాత్మానందను కలిసిన వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement