న్యూఢిల్లీ : ఫెమా చట్టం నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెజాన్ ఇండియాకు ఈడీ షాకిచ్చింది. అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ కు సమన్లు జారీ చేసింది. ఫ్యూచర్ గ్రూపు- అమెజాన్ మధ్య కుదిరిన ఒప్పందంలో అవకతవకల ఆరోపణలపై వచ్చేవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఈ ఒప్పందం అమలులో ఫెమా చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణల నేపథ్యంలో అమెజాన్ పై కేసు నమోదయింది. కాగా ఈడీ సమన్లపై అమెజాన్ ఇండియా ప్రతినిధి ఒకరు స్పందించారు. నోటీసులను పూర్తిగా పరిశీలించిన తర్వాత స్పందిస్తామని చెప్పారు. కాగా అమెజాన్ – ఫ్యూచర్ గ్రూప్ మధ్య ఇప్పటికే పలు వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ – ఫ్యూచర్ రిటైల్ ఒప్పంద అనుమతిని రద్దు చేయాలని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను అమెజాన్ కోరింది. ఫ్యూచర్ రిటైల్ ఆస్తులను రిలయన్స్ కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని, ఒప్పందాన్ని రద్దు చేస్తూ వెలువడిన మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.