Thursday, November 21, 2024

TG | మా పెళ్లికి రండి.. రేవంత్‌కి కిదాంబి శ్రీకాంత్ ఆహ్వానం!

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శ్రీకాంత్… తన పెళ్లికి సీఎంను ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేశారు. శ్రీకాంత్‌కి కాబోయే భార్య శ్రావ్య వర్మ సైతం వెంట ఉన్నారు. తమ వివాహానికి హాజరై ఆశీర్వదించాల్సిందిగా కిడాంబి శ్రీకాంత్, శ్రావ్య వర్మ… పెళ్లి కార్డుతో సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన‌ పెంటాల హరికృష్ణ !

భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటాల హరికృష్ణ తన తల్లిదండ్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 2024 ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఫిడే 45వ చెస్ ఒలింపియాడ్‌లో సాధించిన బంగారు పతకాన్ని, 2022లో చైనాలోని హెంగ్యూలో జరిగిన ఆసియా క్రీడల్లో సాధించిన రజత పతకాన్ని సీఎం రేవంత్‌రెడ్డికి హరికృష్ణ చూపించారు.

అంతర్జాతీయ చెస్ టోర్నీల్లో హరికృష్ణ సాధించిన విజ‌యాల‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వీరి వెంట పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఉన్నారు.

సీఎంను కలిసిన భద్రాచలం బిడ్డ!

పవర్‌లిఫ్టింగ్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగిన తెలంగాణ‌ ఆదివాసీ బిడ్డ, భద్రాచలం ఏజెన్సీలోని ఇప్పగూడెంలో పుట్టి… ఇప్పుడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవర్‌లిఫ్టర్ మోడెం వంశీ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

మాల్టాలో జరిగిన ఇంటర్నేషనల్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో భారత్ తరపున గెలిచిన బంగారు పతకంతో పాటు… ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సాధించిన బంగారు పతకాలను వంశీ సీఎం రేవంత్‌కి చూపించగా, ముఖ్యమంత్రి అభినందించారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తూ.. రోజువారి కూలీ ఇంట్లో పుట్టినా పట్టుదలతో నేడు మోడెం వంశీ భారతదేశాన్ని విశ్వవిజేతగా నిలబెట్టారని మోడెం వంశీని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement