Tuesday, November 19, 2024

Big Story : ఆదాయం జీహెచ్‌ఎంసీకి, నష్టం విద్యుత్‌ సంస్థలకు.. విద్యుత్‌ స్తంభాలకు అల్లుకుపోయిన కేబుల్స్‌

హైదరాబాద్‌, ప్రభ న్యూస్‌ : విద్యుత్‌ స్తంభాలకు అల్లుకు పోయిన కేబుళ్లు విద్యుత్‌శాఖకు అన్నివిధాలుగా నష్టాలను తెచ్చి పెడుతున్నాయి. సొమ్మెకనిది అయితే సోకు మరొకరిది అన్నట్లుగా విద్యుత్‌ స్తంభాలపై ఉన్న కేబుల్స్‌ వ్యవహారం ఉంది. గ్రేటర్‌ పరిధిలో విద్యుత్‌ వినియోగదారుల కోసం వేలాది విద్యుత్‌ స్తంభాలను రోడ్ల వెంట విద్యుత్‌ శాఖ ఏర్పాటు చేస్తే వాటికి స్టార్‌ టీవీ, ఇంటర్‌నెట్‌ వారు కేబుల్స్‌ను ఏర్పాటు చేసుకుని లక్షలు గడిస్తున్నారు. కానీ వీటి వల్ల జరుగుతున్న నష్టాన్ని విద్యుత్‌ శాఖ భరించాల్సి వస్తుంది. కేబుల్స్‌ వారు విద్యుత్‌ స్తంభాలను వాడుకున్నందుకు కనెక్షన్‌కు రూ.25 చొప్పున వినోదపు పన్ను రూపంలో జీహెచ్‌ఎంసీకి పన్ను చెల్లిస్తుండగా, విద్యుత్‌ స్తంభాల సొంతదారైన విద్యుత్‌ శాఖకు మాత్రం నయా పైసా చెల్లించడం లేదు.

ఇదిలా ఉంటే విద్యుత్‌ స్తంభాలపై ఇంటర్‌నెట్‌ వారు ఏర్పాటు చేసుకుంటున్న ఇంటర్‌ నెట్‌ జంక్షన్‌ బాక్స్‌లకు విద్యుత్‌ను కూడా అక్రమంగా వాడుకుం టూ, నెలకు సుమారు రూ.కోటి వరకు నష్టాలకు కారకులవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్‌నెట్‌ జంక్షన్‌ బాక్స్‌లకు విద్యుత్‌ సరఫరా లేనిది పని చేయవు. కానీ ఏవో కొన్నింటికి అనుమతి తీసుకుని వేల సంఖ్యలో ఉన్న బాక్స్‌లకు అక్రమంగా విద్యుత్‌ను వాడుకుంటున్నప్పటికి విద్యుత్‌శాఖ పట్టించుకోక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. స్థానికంగా ఉంటున్న విద్యుత్‌ అధికారులు అక్రమా లకు పాల్పడుతూ చూసీచూడనట్లు వ్యవహారి స్తున్నారనే ప్రచారం ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 50 లక్షల గృహా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వారికి విద్యుత్‌ సరఫరా చేయడానికి విద్యుత్‌ అధికారులు విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ స్తంభాలకు విద్యుత్‌ సరఫరా కోసం వినియోగించే ఐదు వరుసల విద్యుత్‌ కండక్టర్‌( విద్యుత్‌ తీగలు) మాత్రమే ఉండాలి. కానీ గ్రేటర్‌ పరిధిలో ప్రతి స్తంభంపై కనీసం పదికి మించి కెబుల్స్‌ ఉండడం వల్ల విద్యుత్‌ సంస్థకు తీరని నష్టం వస్తుంది. విద్యుత్‌ స్తంభాలను వినియోగించుకున్నందులకు ఒక్క ప్రైవేట్‌ సంస్థ కూడా రూపాయి విద్యుత్‌ సంస్థకు చెల్లించడం లేదు. కేవలం వినోదం పన్ను రూపంలో కనెక్షన్‌కు రూ. 25 ల చోప్పున జీహెచ్‌ఎంసీకి చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. అయితే విద్యుత్‌ స్తంభాలకు కేవలం విద్యుత్‌ కేబుల్స్‌ మాత్రమే ఉంటే వర్షాలు, గాలి దుమారం వచ్చిన సమయంలో చెట్లు విరిగి పడ్డా కేవలం విద్యుత్‌ తీగలు ఉంటే అవి తెగిపోతాయని, అవి కాకుండా కెబుల్స్‌ ఉండడం వల్ల విద్యుత్‌ వైర్లు తెగిపోవడంతో పాటు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడుతున్నాయి. కొన్ని సందర్భాలలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు దగ్గరగా ఉంటే డీటీఆర్‌లు కూడా కింద పడి చెడిపోతూ సంస్థ నష్టాలకు కారణం అవుతుంది. ఈ కెబుల్స్‌ వల్ల దమ్మిడి ఆదాయం లేనప్పుడు ప్రైవేట్‌ కెబుల్‌ టీవీ, ఇంటర్‌నెట్‌ సంస్థలకు ఎందుకు అనుమతి ఇస్తున్నారనేది డాలర్ల ప్రశ్న.

అక్రమంగా ఇంటర్‌నెట్‌ జంక్షన్‌ బాక్స్‌ల ఏర్పాటు :
ఇంటర్‌నెట్‌ను వినియోగదారులకు అందా లంటే ప్రతి 25 నుంచి 30 మంది వినియో గదారులకు ఒక ఇంటర్‌నెట్‌ జంక్షన్‌ బాక్స్‌ను ఏర్పాటు చేయాలి. ఇది పని చేయాలంటే ఖచ్చితంగా విద్యుత్‌ సరఫరా అవసరం. ఇలాంటి ఇంటర్‌ నెట్‌ జంక్షన్‌ బాక్స్‌లు గ్రేటర్‌ పరిధిలో కనీసం 60 వేలకు పైగానే ఉన్నాయని విద్యుత్‌ అధికారులు తెలిపిన సమాచారం. ఇందులో కేవలం ఎనిమిదినుంచి పది వేలకు మించి బాక్స్‌లకు ఏలాంటి అనుమతి లేదు. కొన్నింటికి అనుమతి తీసుకుని మీటర్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. మిగిలిన 50 వేలకు పైగా బాక్స్‌లకు ఏలాంటి అనుమతి లేకుండానే అక్రమంగా విద్యుత్‌ స్తంభాలపై ఏర్పాటు చేసుకుని నేరుగా విద్యుత్‌ను తీసుకుంటున్నారని విద్యుత్‌ అధికారుల నుంచి అందిన సమాచారం.

ఒక్క ఇంటర్‌నెట్‌ జంక్షన్‌ బాక్స్‌కు నెలకు సరాసరిగా 18.6 యూనిట్ల విద్యుత్‌ వాడకం జరుగుతుంది. అంటే అక్రమంగా ఉన్న 50 వేలకు పైగా ఉన్న బాక్స్‌లకు నెలకు ఒక్కదానికి 18.6 యూనిట్ల చోప్పున 9 లక్షల 30 వేల యూనిట్లకు పైగా విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నారని అర్థం అవుతుంది. ఇది కమర్షియల్‌ కనెక్షన్‌ కిందకు వస్తుంది కావున యూనిట్‌కు రూ. 10 చోప్పున లెక్క వేయడంతో రూ.93 లక్షలతో పాటు సర్వీస్‌ చార్జీలు మిగత లేక్క మొత్తం సుమారుగా విద్యుత్‌ సంస్థకు రూ. కోటి నష్టం వస్తుందని చెప్పవచ్చు.

- Advertisement -

అయితే క్షేత్ర స్థాయిలో విద్యుత్‌ అధికారులకు ఈ విషయం తెలిసినా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళకుండా కెబుల్‌, ఇంటర్‌నెట్‌ నిర్వహకుల దగ్గర ఎంతో కొంత అనధికార వసూళ్ళకు పాల్పడుతున్నారనే ప్రచారం సాగుతుంది. ఒక వైపు విద్యుత్‌ సంస్థలు నష్టాల వైపు పరుగులు పెడుతుంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులను సవరించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటి విషయంలో యాజమాన్యం దృష్టి సారించి విద్యుత్‌ స్థంభాలను కెబుల్‌ వైర్ల కోసం వినియోగించు కున్నందులకు పన్నులు వసూలు చేయాలని, ప్రతి ఇంటర్‌నెట్‌ జంక్షన్‌ బాక్స్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ తప్పని సరి చేయాలని కోరుతున్నారు.

ప్రమాదాలకు కారణమవుతున్న కేబుల్స్‌ :
విద్యుత్‌ స్తంభాలకు విరివిగా కేబుల్స్‌ ఉండడం వల్ల విద్యుత్‌ సమస్య వచ్చిన సమయంలో మరమ్మత్తుల కోసం లైన్‌మెన్‌లు, ఆర్టిజన్‌ కార్మికులు విద్యుత్‌ స్తంభంపై ఎక్కిన సమయంలోకేబుల్స్‌ మధ్య చిక్కుకుని కింద పడుతున్న సంఘటనలు చాలా జరిగాయని విద్యుత్‌ కార్మికులు వాపోతున్నారు. కోట్ల రూపాయలు సంపాదిం చుకుంటున్న కేబుల్‌ ఆఫరేటర్లు, ఇంటర్‌నెట్‌ సంస్థలు రూపాయి ఖర్చు లేకుండా విద్యుత్‌ స్తంభాలను వాడుకుని జల్సా చేస్తున్నారని, ఈ విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యుత్‌ ఉద్యోగులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement