Saturday, November 23, 2024

Education | దోస్త్‌లోకి రండి.. డిగ్రీ ప్రైవేట్‌ కాలేజీలను ఆహ్వానించిన ఉన్నత విద్యామండలి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇప్పటి వరకు దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) పరిధిలోకి లేని డిగ్రీ ప్రైవేట్‌ కళాశాలలను దోస్త్‌ కింద తీసుకొచ్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా కాలేజీల యాజమాన్యాలతో సంప్రదించి రాష్ట్రంలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకుగా ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు ఆయా కళాశాలల యాజమాన్యాలతో భేటీ అయి నాన్‌ దోస్త్‌ కాలేజీలను దోస్త్‌లోకి ఆహ్వానించినట్లు తెలిసింది.

డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్‌ పొందాలంటటే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ద్వారానే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా కళాశాలలకు వెళ్లి అడ్మిషన్లు పొందకుండా దోస్త్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి 2016-17లో ఈ దోస్త్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 1074 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 1011 ప్రభుత్వ, ప్రైవేట్‌, రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలుకాగా, మిగతావి 63 వరకు నాన్‌ దోస్త్‌ కాలేజీలు ఉన్నాయి.

ఈ విద్యాసంవత్సరం దోస్త్‌ ప్రక్రియ ద్వారా ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి జారీచేసిన నోటిఫికేషన్‌ సవాల్‌ చేస్తూ కొన్ని నాన్‌ దోస్త్‌ ప్రవేట్‌ కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. అయితే దీనిపై మధ్యంతర ఉత్తర్వులిచ్చిన న్యాయస్థానం దోస్త్‌తో సంబంధం లేకుండా డిగ్రీ అడ్మిషన్లు నిర్వహించుకునేందుకు కాలేజీలకు అనుమతినిచ్చింది. ఇలా ప్రతీ ఏటా దోస్త్‌ నోటిఫికేషన్‌ వెలువడినప్పుడల్లా నాన్‌ దోస్త్‌ కాలేజీలు న్యాయస్థానానికి ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంటున్నాయి. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి మే 11న దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో 63 కాలేజీలు గత నెలలో హైకోర్టును ఆశ్రయించడంతో దోస్త్‌కు సంబంధం లేకుండానే అడ్మిషన్లు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

అలాగే ఈ అంశంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలను ఆదేశిస్తూ విచారణను జూన్‌ 15వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఈకేసు రేపు కోర్టులో విచారణకు రానుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని కాలేజీలు దోస్త్‌ పరిధిలో ఉంటే విద్యార్థులకు మరింత సౌలభ్యంగా, పారదర్శకంగా ఉంటుందనే ఉద్ధేశంతో నాన్‌ దోస్త్‌ కింద ఉన్న దాదాపు 63 కాలేజీలను దోస్త్‌ పరిధిలోకి తెచ్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కాలేజీల యాజమాన్యాలతో సంప్రదింపులు చేస్తోంది.

మరీ ఫీజులు పెంచండి…

దోస్త్‌ పరిధిలోకి రావాలంటే డిగ్రీ కోర్సుల ఫీజులు పెంచాలని యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కోర్సుల ఫీజుల్లో మార్పులు చేర్పులు చేయాలని ఉన్నత విద్యామండలికి ఈమేరకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ప్రస్తుతమున్న ఫీజులతో కళాశాలలను నడపడం కష్టమని తమ గోడును అధికారుల ముందు కాలేజీలు వెల్లబుచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్‌ లాంటి చోట జీతాలు, కిరాయిలు ఎక్కువ. గ్రామీణ ప్రాంత వర్సిటీల పరిధిలో తక్కువ.

అప్పటికీ ఇప్పటికీ కాలేజీల నిర్వహణ భారం, అధ్యాపకుల జీతాల్లో భారీ మార్పులు ఉన్నాయి. దోస్త్‌ పరిధిలోకి వస్తే నామమాత్రపు ఫీజులతో తాము కళాశాలలను నడిపే పరిస్థితి లేదని నాన్‌ దోస్త్‌ కాలేజీలు తేల్చిచెప్పేస్తున్నాయి. ఫీజుల్లో మార్పులు చేర్పులు ఏమైనా చేస్తే అప్పుడు పరిశీలిస్తామని అధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఈక్రమంలోనే ఉన్నత విద్యామండలి దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలను విద్యామందలి తీసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement