Saturday, November 23, 2024

Delhi | అక్టోబర్ 4న విచారణకు రండి.. నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో ఏ-14గా ఉన్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను విచారణకు హాజరుకావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 4న ఉదయం గం. 10.00కి తాడేపల్లిలోని తమ కార్యాలయానికి రావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందించేందుకు ముగ్గురు అధికారులతో కూడిన సీఐడీ బృందం శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకుంది. బయల్దేరే ముందే నారా లోకేశ్ వ్యక్తిగత సిబ్బందితో సీఐడీ అధికారులు మాట్లాడారు. ఢిల్లీ చేరుకున్నా ఎక్కడ కలవచ్చో చెబుతామని వ్యక్తిగత సిబ్బంది సీఐడీ అధికారులు చెప్పారు.

సీఐడీ బృందం ఢిల్లీ చేరుకునే సమయానికి నారా లోకేశ్ అశోక రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్ నివాసం (50, అశోక రోడ్)లో ఉన్నారు. అయితే ఆ ఇల్లు ఎంపీ గల్లా జయదేవ్‌ది కావడంతో అనుమతి లేకుండా అధికారులు అక్కడికి వెళ్తే బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కింద సీఐడీ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే సీఐడీ అధికారులు గల్లా జయదేవ్‌ను సంప్రదించి ఇంట్లోకి వచ్చేందుకు అనుమతి కోరినట్టు తెలిసింది. సాయంత్రం సరిగ్గా గం. 4.50 సమయంలో ముగ్గురు సీఐడీ అధికారులు గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్నారు.

అప్పటికే టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు గల్లా నివాసంలో ఉన్నారు. గేట్ వద్ద సిబ్బందితో మాట్లాడి లోపలకు వెళ్లిన సీఐడీ అధికారులకు లోకేశ్ సాదరంగా స్వాగతం పలికారు. నోటీసులు అందుకుంటూ వారితో మాటలు కలిపారు. “నాకు ఆల్రెడీ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు కదా.. మళ్లీ ఇవి ఎందుకు? నోటీసులు అందాయి అన్నట్టుగా వాట్సాప్‌లో బదులిచ్చాను కదా?” అంటూ వారిని ప్రశ్నించారు. వాట్సాప్ మెసేజ్ చేరేలోగా తాము ఢిల్లీ బయల్దేరామని, నేరుగా కలిసి నోటీసులు ఇవ్వడం కోసమే వచ్చామని సీఐడీ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా రాక రాక వచ్చారు, టీ-కాఫీ ఏదైనా తాగండి అంటూ వారికి ఆతిథ్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. నోటీసులు అందినట్టు సంతకాలు పెట్టండి అంటూ సీఐడీ అధికారులు బదులిచ్చారు. నోటీసు చదవకుండా ఎలా సంతకం పెట్టాలంటూ ప్రశ్నించిన ఆయన, అందులో కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫార్మాట్ ప్రకారం నోటీసు తయారైందని అధికారులు వివరణ ఇచ్చిన తర్వాత ఆయన నోటీసులు అందినట్టు సంతకం పెట్టారు. సుమారు 20-25 నిమిషాల పాటు లోపల ఉన్న అధికారులు ఆ వెంటనే అక్కణ్ణుంచి తిరిగి వెళ్లిపోయారు. వెళ్తూ.. వెళ్తూ తాము అక్టోబర్ 4న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని, ఆయన మరో తేదీని కోరలేదని తెలిపారు.

- Advertisement -

నోటీసులో ఏముంది?

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో నారా లోకేశ్‌ను నిందితుడిగా చేర్చిన ఆంధ్రప్రదేశ్ సీఐడీలో ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41(ఏ) ప్రకారం నోటీసులిచ్చింది. తాము నమోదు చేసిన కేసు క్రైమ్ నెం.16/2022 ఎఫ్ఐఆర్ విచారణకు సంబంధించి ఈ నోటీసులు ఇస్తున్నట్టు పేర్కొంది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్లు 120(B), 409, 420, 34, 35, 36, 37, 166, 167, 217తో పాటు అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 13(2), 13(1)(c) (d) కింద విచారణ చేపట్టినట్లు నోటీసుల్లో పేర్కొంది.

అక్టోబర్ 4న ఉదయం గం.10.00కి తాడేపల్లిలోని హెచ్-బ్లాక్‌, సమృద్ధి నెక్సా అపార్ట్‌మెంట్స్ లో ఉన్న తమ కార్యాలయంలో విచారణకి హాజరుకావాలని సీఐడీ స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోవడానికి, ప్రశ్నించడానికి తమ వద్ద సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని కూడా నోటీసుల్లో తెలిపింది. భవిష్యత్తులో ఎలాంటి నేరం చేయననని, ఏ విధంగానూ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయననని, కేసు వాస్తవాలతో పరిచయం ఉన్న ఏ వ్యక్తికి ఎలాంటి బెదిరింపులు చేయనని, కోర్టుకు లేదా పోలీసు అధికారికి  వాస్తవాలను బహిర్గతం చేయకుండా నిరోధించబోనని ఒప్పుకుంటున్నట్టు ఆ నోటీసుల్లో ప్రస్తావించింది.

అలాగే అవసరమైనప్పుడు / నిర్దేశించినప్పుడు కోర్టు ముందు హాజరవుతానని, కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని, దర్యాప్తును ముగించే క్రమంలో సంబంధిత అంశంలో..  ఏ భాగాన్ని దాచకుండా అన్ని వాస్తవాలను నిజాయితీగా బహిర్గతం చేస్తానని పేర్కొంటున్నట్టు నోటీసుల్లో ఉంది. కేసుకు సంబంధించి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా వివరాలు, భూ లావాదేవీలకు సంబంధించిన బోర్డు సమావేశాల మినిట్స్‌తో కూడిన పుస్తకాన్ని, ఆ లావాదేవీలకు అవసరమైన చెల్లింపు వివరాలను తమకు దర్యాప్తులో భాగంగా అందజేయాలని కూడా సీఐడీ ఆ నోటీసులో పేర్కొంది.

సంబంధిత సాక్ష్యాలను నాశనం చేయడానికి ఏ విధంగానూ ప్రయత్నం చేయవద్దని నిబంధనల్లో వెల్లడించింది.ఒకవేళ సీఐడీ నోటీసులో ఉన్న అంశాలు పాటించకపోయినా.. విచారణకు హాజరుకాకపోయినా.. సీఆర్పీసీ సెక్షన్ 41A(3), (4) కింద అరెస్టుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇదంతా చదివిన తర్వాత కొన్ని అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన లోకేశ్, చివరకు తాను నోటీసు స్వీకరించినట్టు సంతకం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement