జపాన్‌కు చెందిన రెండు నేవీ హెలికాఫ్టర్లు ఢీకొన్నట్లు ఆదివారం రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఏడుగురు గల్లంతైనట్లు వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ప్రకటించింది.
వివరాల ప్రకారం.. శిక్షణలో భాగంగా సముద్రంపై గస్తీ చేపట్టే రక్షణ శాఖ (ఎంఎస్‌డిఎఫ్)కి చెందిన రెండు ఎస్‌హెచ్ -60కెలు నలుగురు చొప్పున సిబ్బందితో బయలుదేరాయి. టోక్యోకు దక్షిణంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోరిషిమా ద్వీపం సమీపంలో శనివారం అర్థరాత్రి సిగల్స్‌ను కోల్పోయినట్లు రక్షణ మంత్రి మినోర్ కిహారా తెలిపారు.
ప్రమాదానికి గల కారణం తెలియలేదని, సముద్రంలో కూలిపోయే ముందు రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొని ఉండవచ్చని అన్నారు. సముద్రం నుండి రెండు హెలికాఫ్టర్ల శకలాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గల్లంతైన వారికోసం ఎంఎస్‌డిఎఫ్‌కి చెందిన ఎనిమిది యుద్ధనౌకలు, ఐదు విమానాలు మోహరించినట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని అన్నారు.