Tuesday, November 26, 2024

ఫీజు కడితేనే హాల్‌టికెట్లు ఇస్తామంటున్న‌ కాలేజీలు.. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 15 నుంచి ఇంటర్‌ పరీక్షలు ఉండడంతో హాల్‌ టికెట్లు ఇచ్చేందుకు కొన్ని ప్రైవేట్‌ కాలేజీలు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయి. హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఆయా కాలేజీలకే లాగిన్‌ ఐడీలు ఇవ్వడంతో ఫీజులు వసూలుకు ఇదే సరైన సమయమని భావించిన కాలేజీలు హాల్‌టికెట్‌కు ఫీజుకు ముడిపెడుతున్నారు. హాల్‌టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలని సూచిస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అధికారులు ఇప్పటికే అందుబాటులో ఉంచారు. అయితే వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుందామని విద్యార్థులు వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయగా కాలేజీ కోడ్‌, పాస్‌ వర్డ్‌ లాంటివి అడుగుతున్నట్లు చూపిస్తోందని విద్యార్థులు అంటున్నారు. కాలేజీ కోడ్‌, పాస్‌ వర్డ్‌లను ఫీజు కడితే గానీ కాలేజీ యాజమాన్యాలు చెప్పే పరిస్థితి లేదు. అదే పబ్లిక్‌ డొమైన్‌లో హాల్‌టికెట్లు పెడితే ఎలాంటి కోడ్‌, పాస్‌ వర్డ్‌ లేకుండానే నేరుగా విద్యార్థులే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కానీ పబ్లిక్‌ డొమైన్‌లో విద్యార్థుల హాల్‌టికెట్లను అధికారులు పెట్టకపోవడంతో ఫీజులు కడితేనే హాల్‌టికెట్లను ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు వేధిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏ మాత్రం ఫీజు బకాయిలు ఉన్నా హాల్‌ టికెట్‌ ఇచ్చేది లేదంటూ పేరెంట్స్‌పై, విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో పరీక్షల సమయంలో చదువుకోవాల్సిన విద్యార్థులు హాల్‌టికెట్ల కోసం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొన్ని కాలేజీలైతే హాల్‌టికెట్‌ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నా ఇంటర్‌ బోర్డు అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పేరెంట్స్‌ విమర్శిస్తున్నారు. ఫీజులు తర్వాత చెల్లిస్తామని వేడుకుంటున్నా కనికరించట్లేదని, అప్పు చేసి తీసుకొచ్చి ఫీజులు కట్టి హాల్‌ టికెట్లను కొందరు తీసుకెళ్తున్నారు.

- Advertisement -

ఫీజు కట్టిన తర్వాతే తమ సర్టిఫికెట్లు ఇవ్వండని మరికొందరు వేడుకుంటున్నా కనికరించడంలేదని ఆవేదన చెందుతున్నారు. కావాలనే కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్‌ బోర్డు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం పరీక్షలకు ఒకట్రెండు రోజుల ముందు హాల్‌టికెట్లను పబ్లిక్‌ డొమైన్‌లో విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకునేలా అందుబాటులో ఉంచుతామని అంటున్నారు. అయితే హాల్‌టికెట్లను ఒకట్రెండు రోజుల ముందు డౌన్‌లోడ్‌ చేసుకునే విద్యార్థులు చాలా తక్కువగా ఉంటారు. ఈలోపే చాలా మంది విద్యార్థులు ఎలాగో అలా ఫీజులు కట్టుకొని, ప్రజాప్రతినిధులతో ఫౖౖెరవీ చేయించుకునో హాల్‌టికెట్లను తీసుకెళ్తారు. చివరి ఒకట్రెండు రోజుల్లో వెబ్‌సైట్‌లో పెట్టడం ద్వారా పెద్దగా విద్యార్థులకు ప్రయోనం ఏముంటుందని? విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement