హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఉన్నత విద్యను అందించే కళాశాలల సంఖ్య తగ్గిపోతోంది. ఒక పక్క కాలేజీలు తగ్గుతుంటే మరో పక్క ప్రైవేట్ యూనివర్శిటీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వృత్తి విద్యను అందించే ఇంజనీరింగ్ కాలేజీలు ఉపాధ్యాయ విద్యను అందించే డైట్ కాలేజీలు భారీగా మూతపడుతున్నాయి. ప్రతీ ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి వీటి సంఖ్య ఎంతో కొంతగా తగ్గిపోతున్నది. 2015లో రాష్ట్రంలో 212 డైట్ ప్రైవేట్ కాలేజీలుంటే, 10 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా 2015 వరకు రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. ఒకప్పుడు ఈ రెండు కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉండేది.
కానీ ప్రస్తుతం ఆ కోర్సులు అందించే కాలేజీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. 2023 నాటికి డైట్ కాలేజీల సంఖ్య 45కు పడిపోగా, ఇంజనీరింగ్ కాలేజీలు సంఖ్య 159కి తగ్గింది. కోర్సులకు డిమాండ్ లేకపోవడం, ప్రైవేట్ యూనివర్శిటీలు పుట్టుకు రావడం, కాలేజీలు ఇబ్బడిముబ్బడిగా ఉండడంతో జిల్లాల్లోని కాలేజీలు పోటీని తట్టుకోలేకపోతున్నాయి. నిర్వహణ భారం కూడా తడిచి మోపెడవుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కాలేజీలే ఎక్కువగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు హైదరాబాద్‌లో చదువుకుంటూ ఉద్యోగం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. దీంతో అక్కడి నుంచి వారు నగరానికి వస్తుండటంతో గ్రామీణ ప్రాంతాలు, టౌన్‌లలో ఉండే కాలేజీల్లో సీట్లు నిండడంలేదు. అరకొర సీట్ల భర్తీతో కాలేజీలను నడపడం కష్టతరమవుతుండటంతో ఇక చేసేదిలేక కాలేజీలను మూసేస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ యూనివర్శిటీలు పెరుగుతున్నాయి. కొత్త కొత్త కోర్సులను అవి అందిస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా ఇస్తుండటంతో జిల్లాల్లోని ప్రైవేట్ కాలేజీలు ఈ పోటీని తట్టుకోలేకపోతున్నాయి.
ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. విదేశీ యూనివర్శిటీలు హైదరాబాద్‌లో తమ బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు ప్రైవేట్ యూనివర్శిటీలు ఉండగా, మరో ఐదు యూనివర్శిటీల దస్త్రం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. మరికొన్ని యూనివర్శిటీలు వచ్చే విద్యా సంవత్సరంలో రాబోతున్నట్లు సమాచారం. ఐదు ప్రైవేట్ యూనివర్శిటీ బిల్లు ఆమోదంపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో అవి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
డీఎడ్, బీఎడ్ కోర్సులను అందించే కాలేజీల సంఖ్య ప్రతీ ఏటా పడిపోతోంది. 2015లో 212 ప్రైవేట్, పది ప్రభుత్వ కాలేజీలుంటే 2021 నాటికి ప్రైవేట్ కాలేజీల సంఖ్య 99కి పడిపోయింది. అదే 2023 నాటికి 99 నుంచి 45కు పడిపోగా, ప్రభుత్వ కాలేజీలు 9కు తగ్గాయి. టీచర్ పోస్టులకు సంభంధించి నోటిఫికేషన్లు సరిగా వెలువడకపోవడంతో డీఎడ్, బీఎడ్ కోర్సులను చేసేందుకు విద్యార్థులు ముందుకు రావడంలేదు.
కోర్సులు చేసి ఖాళీగా ఉంటున్నారు. కొంత మంది ఖాళీగా ఉండలేక ప్రైవేట్ స్కూళ్లల్లో పనిచేస్తున్నారు. దీంతో ఆ కోర్సులు చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. కొత్తగా ఎవరూ జాయిన్ కావడంలేదు. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి ప్రతీ ఏడాదికో, రెండేళ్లకో ఉన్న పోస్టులను భర్తీ చేస్తే ఉపాధ్యాయ కోర్సులను అభ్యసించడానికి విద్యార్థులు ముందుకు వస్తారని విద్యా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కోర్సు పూర్తి చేసి టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నవారు దాదాపు ఐదారు లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో ఉన్నారు.