హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా నవంబర్ 2 వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి సిహెచ్. రవీందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్లను లెక్కించాలని, కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ఐదు వివి ప్యాట్ ల లోని స్లిప్పు లను కూడా లెక్కించాల్సి ఉంటుందని, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్ ల లెక్క సరిగ్గా ఉండాల్సి ఉంటుందని అన్నారు.
ఫారం 17సి నీ చెక్ చేయాలని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రంలో ఉదయం ఆరు గంటలకే రిపోర్ట్ చేయాలని సూచించారు. కౌంటింగ్ టేబుల్స్ వద్ద అలాటు చేసిన కౌంటింగ్ సిబ్బంది ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంటుందని అన్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని, అనంతరం బ్యాలెట్ యూనిట్ లు, కంట్రోల్ యూనిట్లు లెక్కించాల్సి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ సూపర్ వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ అబ్జర్వర్లు, పకడ్బందీగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని అన్నారు. మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ సిబ్బంది చేపట్టే లెక్కింపు కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ లో నిర్లక్ష్యం వహించ వద్దని అలర్ట్ గా ఉండాలని, అభ్యర్థుల తరపున కౌంటింగ్ లో పాల్గొనే ఏజెంట్లతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి ఏజెంట్లకు ఎప్పటికప్పుడు వివరించాలని అన్నారు. కౌంటింగ్ సమయంలో సొంత నిర్ణయాలు
తీసుకోవద్దని, ఏమైనా సందేహాలుంటే రిటర్నింగ్ అధికారికి తెలపాలని అన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణ శంకర్ నారాయణ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ ను సజావుగా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి సిహెచ్. రవీందర్ రెడ్డి కౌంటింగ్ ప్రక్రియ లోని పలు అంశాలపై కౌంటింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. మాస్టర్ ట్రైనర్ రాజేందర్ రెడ్డి కౌంటింగ్ ప్రక్రియ లో చేపట్టవలసిన అంశాలపై సమగ్ర శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియ లో పాల్గొని కౌంటింగ్ సిబ్బంది అందరికీ కోవిడ్ రాపిడ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. కౌంటింగ్ సిబ్బంది అందరూ కోవిడ్ సర్టిఫికెట్లను, కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డులను వెంట తీసుకురావాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి సెల్ ఫోన్లు, పెన్నులు తీసుకురావద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, ఎన్నికల నోడల్ అధికారులు వి. శ్రీధర్, బి. రవీందర్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.