Wednesday, November 20, 2024

హమాలీ ఉద్యోగాల పేరుతో కోట్లలో వసూళ్లు.. నిందితుల అరెస్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శాశ్వత ప్రాతిపదికన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో హమాలీ ఉద్యోగాలు కల్పిస్తామని ఆశచూపి నిరుద్యోగుల నుంచి లక్షల్లో దండుకోవడంతోపాటు ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు కారణమైన నిందితులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఎరువుల లోడింగ్‌/అన్‌లోడింగ్‌ హమాలీ పనుల కోసం పెద్ద ఎత్తున కార్మికుల అవసరం ఉండడంతో … మ్యాన్‌ పవర్‌ టెండర్‌ దక్కించుకున్న మోహన్‌గౌడ్‌, గుండు రాజు అక్రమ పద్దతిలో ధనార్జనకు తెరదీశారు. ఈ కేసు వివరాలను శనివారం పెద్దపల్లి డీసీపీ రూపేష్‌ కుమార్‌ మీడియాకు వెల్లడించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగమని, ప్రతీ నెలా జీతం పెరుగుతుందని, వైద్య సదుపాయం, నివాస క్వార్టర్‌ కేటాయిస్తామని గోపగాని మోహన్‌గౌడ్‌, గుండు రాజు , చెలకపల్లి సతీష్‌, బొమ్మగాని తిరుపతిగౌడ్‌ నిరుద్యోగులకు ఆశచూపి ఒక్కోక్కరి నుంచి రూ.3 నుంచి రూ.7లక్షల దాకా వసూలు చేశారు. 650 ఖాళీలకుగాను 300 మంది నుంచి 14కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత కార్మికుల నియామక టెండర్‌ మరో సంస్థకు రావడంతో ఆ సంస్థ 200 మందిని తొలగించింది.

ఈ వ్యవహారంతో నిందితుల వసూళ్లపర్వం వెలుగు చూసింది. ఇదే సమయంలో హమాలీ ఉద్యోగం వస్తుందన్న ఆశతో 7లక్షలు చెల్లించిన కేశవపట్నం మండలం అంబాలాపూర్‌కు చెందిన ముంజ హరీష్‌ తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. నిందితులు బెదిరించడంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హరీష్‌ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న పేర్ల ఆధారంగా దర్యాప్తు చేసిన రామగుండం పోలీసులు నిందితులు చెలకపల్లి సతీష్‌, గుండు రాజు, గోపగాని మోహన్గౌడ్‌, బొమ్మగాని తిరుపతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాధితులు ఇంకా ఉంటే పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని, క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పొడొద్దని డీసీపీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement