Tuesday, November 26, 2024

Delhi | ఖరీఫ్‌లో 521.27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ.. కేంద్రం అంచనా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఖరీఫ్ సీజన్‌లో పండిన వరి (బియ్యం) సేకరణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ఆహార, ప్రజా పంపిణీ శాఖల కార్యదర్శులతో కేంద్రం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భారత ఆహార సంస్థ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 521.27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని అంచనాలు వేసినట్టు కేంద్రం తెలిపింది. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో 518 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ అంచనాలు వేయగా, 496 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరణ జరిగింది.

ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యంలో పంజాబ్ (122 ఎల్ఎంటీ), ఛత్తీస్‌గఢ్ (61 ఎల్ఎంటీ), తెలంగాణ (50 ఎల్ఎంటీ) రాష్ట్రాలు ముందు వరుసలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా (44.28 ఎల్ఎంటీ), ఉత్తరప్రదేశ్ (44ఎల్ఎంటీ), హర్యానా (40 ఎల్ఎంటీ), మధ్యప్రదేశ్ (34 ఎల్ఎంటీ), బీహార్ (30 ఎల్ఎంటీ), ఆంధ్రప్రదేశ్ (25 ఎల్ఎంటీ), పశ్చిమ బెంగాల్ (24 ఎల్ఎంటీ), తమిళనాడు (15 ఎల్ఎంటీ) రాష్ట్రాలు నిలిచాయి.

అలాగే ఈ ఏడాది 33.09 లక్షల మెట్రిక్ టన్నుల తృణధాన్యాలు, చిరు ధాన్యాలు (శ్రీ అన్న) సేకరించాలని కూడా కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఏడాది నుంచి రాగులతో పాటు 6 రకాల మిల్లెట్లకు కనీస మద్దతు ధర కల్పిస్తూ సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే మిల్లెట్ల సేకరణ, వినియోగాన్ని పెంచడం కోసం ప్రభుత్వం పంపిణీ వ్యవధిని సవరించడంతో పాటు అంతర్-రాష్ట్ర రవాణాకు వీలు కల్పించింది. అలాగే సబ్సిడీని జోడించడంతో పాటు ఆరు మైనర్ మిల్లెట్ల సేకరణను సులభతరం చేయడానికి మార్గదర్శకాలను సవరించింది.

- Advertisement -

రాష్ట్రాల కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో గన్నీ బ్యాగుల అవసరం, నిర్దేశిత డిపోల నుంచి సరసమైన రేషన్ దుకాణాలు వరకు ఆహార ధాన్యాల రవాణాకు రూట్ ఆప్టిమైజేషన్, కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, గోధుమ స్టాక్ పరిమితి పోర్టల్ పర్యవేక్షణ మొదలైన అంశాలపై చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement