బీహార్‌లో వంతెనలు కూలిపోవడం ఇంకా ఆగడం లేదు. ఇప్పటికే గత కొద్ది రోజులుగా రోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండగా, తాజాగా గురువారం ఉదయం మరో వంతెన కుప్పకూలింది. ఇది 24 గంటల వ్యవధిలో మూడోది, అలాగే,15 రోజుల్లో 11వ ఘటన కావడం గమనార్హం. సరన్ జిల్లాలోని బనియాపూర్‌లో గండకి నదిపై సరేయ పంచాయతీ పరిధిలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఇది సరన్ జిల్లాలోని అనేక గ్రామాలను పొరుగున ఉన్న సివాన్ జిల్లాతో కలుపుతుంది. ఇప్పుడు ఈ వంతెన కూలడంతో రెండు జిల్లాలకు చెందిన అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వంతెనను 15 ఏళ్ళ క్రితం నిర్మించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగంలోని పలువురు అధికారులు అక్కడికి చేరుకున్నారు. వంతెన కూలడానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.
సరన్ జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్, వంతెన కూలి పోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బీహార్ రాష్ట్రంలో వంతెనలు కూలిపోతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం సరన్ జిల్లాలోని జంతా బజార్‌లో, లహ్లాద్‌పూర్‌లో మూడు చిన్న వంతెనలు కూలిపోగా, తాజాగా మరో వంతెన కూలిపోయింది.