Saturday, November 23, 2024

మెడికల్ కాలేజీలు, ఆరోగ్య పథకాలకు సహకరించండి.. కేంద్రానికి మంత్రి విడదల రజని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వైద్యారోగ్య అంశాల్లో పురోగతి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. గురువారం జరగనున్న డిజిటెక్ కాంక్లేవ్‌లో పాల్గొనడానికి ఆమె ఢిల్లీ వచ్చారు. వైద్య రంగంలో సంస్కరణల అమలు, ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడంలో యాక్షన్ ప్లాన్ తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున సత్కారాన్ని అందుకోనున్నారు. ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్‌తో కలిసి ఆమె బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిశారు. వైద్య రంగానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. పెండింగ్ ఫైల్స్, నిధుల మంజూరు, మెడికల్ కాలేజీలకు అనుమతులకు సంబంధించి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చేపడుతున్న ఆరోగ్య పథకాలు, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నుంచి అన్నిరకాలుగా సహాయ సహకరాలు అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. వైద్య రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపడుతున్న చర్యలను ఆయన ప్రశంసించారని రజని సంతోషం వ్యక్తం చేశారు. కాసేపటి కింద జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న పథకాలు, పద్దతుల అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రితో చర్చించామని మన్సుఖ్ మాండవీయ తెలిపారన్నారు. త్వరలోనే స్వయంగా ప్రధానమంత్రిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్టు ఆమె వెల్లడించారు. ఆరోగ్య రంగంలో పురోగతి సాధిస్తున్ రాష్ట్రానికి తప్పకుండా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారని చెప్పారు.పెండింగ్ ఫైల్స్ మీద కూడా చర్చ జరిగిందని రజని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement