భోపాల్ – మధ్యప్రదేశ్‌లో గత 15 రోజులుగా తీవ్రమైన చలి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా గ్వాలియర్ జిల్లాలో గత ఆరు రోజులుగా చలి తీవ్రత కొనసాగుతోంది. వారం రోజులుగా ఇక్కడి జనం ఎండను చూడనేలేదు. చలిగాలుల కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో గ్వాలియర్ జిల్లాలో తీవ్రమైన చలి కారణంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరిగిపోతున్నాయి. స్థానిక హాస్పిటల్ కాంప్లెక్స్‌లోని కార్డియాలజీ విభాగానికి వస్తున్న గుండెపోటు బాధితుల సంఖ్య మరింతగా పెరిగింది. రోజూ దాదాపు 30 నుంచి 35 మంది బాధితులు వస్తున్నారు. గత ఆరు రోజుల్లో గుండెపోటుతో 17 మంది రోగులు మృతిచెందగా, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 31 మంది కన్నుమూశారు.
అక్టోబర్-నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్, జనవరిలో హృద్రోగుల సంఖ్య 25 నుంచి 30 శాతం వరకూ పెరుగుతున్నదని, ప్రతిసారీ ఇదే పరిస్థితి కనిపిస్తోందని జయరోగ్య ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ కవి భార్గవ తెలిపారు. చలి వాతావరణం తీవ్రమైనప్పుడు గుండెపోటు, రక్తపోటు కేసులు పెరుగుతాయని హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ రామ్ రావత్ పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వాసుపత్రుల్లో గుండెపోటు, స్ట్రోక్ బాధితుల సంఖ్య 30 శాతం పెరగగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో గుండెపోటు బాధితుల సంఖ్య 40 శాతం మేరకు పెరిగింది.