హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఉక్కపోతలతో తల్లడిల్లుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 16నుంచి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయని ప్రకటించింది. తూర్పు,ఆగ్నేయం దిశనుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండటం దీనికి సంకేతంగా వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్ గఢ్ నుంచి విదర్భ, తెలంగాణమీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఆవరించి ఉండటంతో వర్షాలు కురువనున్నాయి. ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువస్థాయిలో నమోదు అయ్యే అవకాశాలున్నాయి.
అలాగే 16 అనంతరం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాక తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అయితే సాధారణ ఉష్ణోగ్రతలకంటే ఇది 2.6 డిగ్రీలు తక్కువ. ఈ నెల 20వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో దంచి కొడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు క్రమేణ తగ్గుతుండటంతో వాతావరణంలో చల్లదనం20 వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనావేసింది. అయితే 16 నుంచి వర్షాలు కురిసే అవకాశాలు అధికంగా ఉండటంతో 20 వరకు వాతావరణం చల్లబడినా తిరిగి ఎండలు విజృంభించే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెప్పారు. అయితే 16 నుంచి వర్షాలు కురుస్తాయని చెప్పడంతో రైతుల్లో, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.