హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం విలవిలాడుతున్నారు. నెల రోజులుగా రాష్ట్రంలో చలి విపరీతంగా పెరిగిపోతోంది. చలి పంజా దాటికి ప్రజలు ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో రోగ నిరోధకశక్తి తగ్గటంతో జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో పిల్లల వార్డుల్లో రోజుకు 15 నుంచి 20 మంది చిన్నారులు ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. అదే సమయంలో ఓపీకి కూడా దగ్గు, గొంతునొప్పి, జలుబు, జ్వరంతో పెద్ద సంఖ్యలో చిన్నారులు వస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సీజనల్ జ్వరాలు, పోస్టు కొవిడ్ లక్షణాలతో బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పడిపోతోందని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాల సంఘం (టీఆర్ఎస్ఎంఏ) వెల్లడించింది.
చలికాలంలో అనేక రకాల వైరస్లు చురుకుగా ఉంటాయని, ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించి జలుబు, దగ్గు, జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో చాలా మందిలో మైల్డ్ కొవిడ్, స్వైన్ ఫ్లూ తరహా ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్నాయి. చలికాలం కారణంగా వాతావరణంలో తేమ శాతం పెరగడంతో ప్రజలు అనేక జబ్బుల బారిన పడుతున్నారు. ఈ తరహా వాతావరణంలో ప్రజలు అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదముందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ తగ్గిపోయిందని నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రస్తుతం కొవిడ్‌తోపాటు స్వైన్ ఫ్లూ, ఆర్‌ఎస్‌వీలు కూడా ఎక్కువగా విజృంభిస్తున్నాయంటున్నారు. ఆర్ఎస్వీ అంటే జలుబులో ఒక కారకమైన ఇన్ఫెక్షన్ అని, దగ్గు, జ్వరం , జలుబు, ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉంటే ఆర్ఎస్వీగా అనుమానించాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలి కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి చిన్నారులను కాపాడాలంటే ఉదయం, సాయంత్రం వేళ్లలో వారిని బయట తిరగనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచిస్తున్నారు. ఐస్‌క్రీమ్‌తోపాటు ఫ్రీజ్‌లో పెట్టిన పదర్థాలు, శీతల పానీయాలు తదితరాలకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. స్వెట్టర్లు, మంకీ క్యాపులు వాడాలని, పెంపడు జంతువులకు దూరంగా ఉంచాలని చెబుతున్నారు.