Thursday, November 21, 2024

కొడిపుంజును అరెస్ట్ చేస్తారా……

కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ….మన పోలీసులు ఆయన కవితకు పేరడీ అన్నట్లుగా కాదేదీ నేరారోపణకు అనర్హం అంటున్నారు! అనడమే కాదు…చేసి చూపిస్తున్నారు. జగిత్యాల జిల్లా పోలీసులు ఒక కోడి పుంజును అతి కష్టం మీద అరోస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేశారయ్యా అంటే ఆ పుంజు ఓ హత్య చేసిందట! ఆశ్చర్యం ఏమీ లేదు పోలీసులు ఆ కోడి పుంజు మీద పెట్టిన కేసు అదే!  అరెస్టు చేసిన కోడి పుంజును భద్రతా వలయంలో ఉంచారు. ఈ సంఘటన గొల్లపల్లి మండలం తొత్తునూరు గ్రామంలో జరిగింది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే…? గ్రామంలో ఇటీవల కోడి పందేలు జరిగాయా. ఆ కోడి పందేల కోసం సిద్ధం చేసిన ఈ కోడి పుంజు కాలికి  కట్టిన కోడి కత్తి తగిలి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. దాంతో ఈ కోడు పుంజు హంతకుడు అయ్యింది. పోలీసులు చాలా ప్రామ్ట్ గా కేసు నమోదు చేసి హంతకుడిని అరెస్టు చేశారు.  ఇంతకీ ఆ హంతకుడి నుంచి పోలీసులు స్టేట్ మెంట్ ఎలా రికార్డు చేస్తారు…కోడి భాష నేర్చుకుంటారా? అంటూ ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. అయినా పోలీసులు కేసులు పెట్టి మేకలు, గొర్రెలు, ఉడుతలు, పక్షులను అరెస్టు చేయడం ఇదే మొదటి సారీ కాదు…చివరి సారి కూడా కాబోదు….

తెలంగాణ పోలీసులు ఇలాంటి ఘన కార్యాన్ని గత ఏడాది కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరిత హారం మొక్కలను తినేశాయంటూ…రెండు మేకలను అరెస్టు చేశారు.  వాటిని పోలీసు స్టేషన్ ఆవరణలో కట్టేసి వేరే మొక్కలను పీకి వాటికి ఆహారంగా వేశారు. ఆనక తీరిగ్గా తప్పు తెలుసుకుని ఆ మేకల యజమానికి జరిమానా వేసి వాటిని వదిలిపెట్టారు.  అయినా మన తెలంగాణ పోలీసులే కాదు విదేశాల్లోని పోలీసులు కూడా ఇలాంటి ఘనకార్యాలు చేస్తూ తమేమీ తక్కువ తినలేదని చాటుకున్న సంఘటనలూ ఉన్నాయి.

జర్మనీలో అయితే తనను ఓ ఉడుత వేధిస్తోందంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు నానా హంగామా చేసి ఆ ఉడుత పిల్లను అరెస్టు చేశారు. ఆ తరరువాత తమ నిర్బంధంలోనే ఆ ఉడుతకు ఆహారం తినిపించడం, పాలు తాగించడం వంటివి చేసి చివరకు కేసు పెట్టకుండానే వదిలేశారు. నడి రోడ్డు మీద హత్య చేసి హంతకులు దర్జాగా తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు మూగ జీవాలను అదుపులోనికి తీసుకోవడంలో మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తారంటూ అక్కడి నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

అలాగే నెదర్లాండ్స్ లో పోలీసులు ఓ పక్షిని అరెస్టు చేశారు. ఇంతకీ ఆ పక్షి చేసిన నేరమేమిటయ్యా అంటే… ఒక షాపులో దొంగతనం చేసిన వ్యక్తి ఆ పక్షిని పెంచుకోవడమే. దీంతో పోలీసులకు అతడి చోరీలలో ఆ పక్షికీ భాగం ఉందని అనుమానించి అరెస్టు చేసేశారు. అంతటితో ఆగకుండా మేం పక్షిని అరెస్టు చేశామంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి తమ జబ్బలు తామే చరుచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement