Friday, November 22, 2024

Delhi | కూటమి పొత్తులు.. కాంగ్రెస్‌లో లుకలుకలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజకీయాల్లో పొత్తులతో లాభం, నష్టం రెండూ ఉంటాయి. రాజకీయ గణాంకాలు, అంక గణితం కూడా ఒకటి కాదు. ఒకటి, ఒకటి కలిస్తే రెండు అయినట్టు రాజకీయాల్లో రెండు పార్టీల పొత్తులతో ఆ రెండు పార్టీల ఓటుబ్యాంకు జతకలిస్తుందని కూడా చెప్పలేం. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. విశ్లేషిస్తే అనేక కారణాలు కూడా కనిపిస్తాయి. అప్పటి వరకు క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రత్యర్థులుగా, బద్ధవిరోధులుగా ఉన్నవారు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి రావడం ఒక కారణమైతే, పొత్తుల కారణంగా కొందరు నేతలు తమ సీట్లను మిత్రపక్ష అభ్యర్థి కోసం త్యాగం చేయాల్సి రావడం మరో కారణం.

ఈ తరహా పరిస్థితులు పొత్తులతో ఆశించిన ప్రయోజనాలను అందించకపోగా.. మొత్తంగా నష్టాన్ని కల్గిస్తుంటాయి. ఇప్పుడు దేశంలో విపక్ష కూటమి (ఐ.ఎన్.డీ.ఐ.ఏ)లో అదే పరిస్థితి ఏర్పడింది. ఈ కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ పొత్తులతో చిక్కులు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీకి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్న కుటుంబాలకు చెందిన నేతలు సైతం ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కొందరు ఏకంగా పార్టీ వీడి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.

ఇంతకాలం కూటమిలో పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాటు తేల్చకుండా రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో కాంగ్రెస్ అగ్రనాయకత్వం తలమునకలై ఉండడంతో సమాజ్‌వాదీ పార్టీ వంటి మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అల్టిమేటం కూడా జారీ చేశాయి. తీరా సీట్ల సర్దుబాటును ఒక కొలిక్కి తీసుకొస్తున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సొంత పార్టీ నేతల నుంచే ధిక్కారస్వరాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. అలాగే పంజాబ్ మినహా ఢిల్లీ, గుజరాత్, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా సీట్ల పంపకాల సమస్య పరిష్కారమైంది.

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తో, మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం)తో కూడా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై మంతనాలు సాగుతున్నాయి. మొత్తంగా విపక్ష కూటమిలో ప్రధాన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. సరిగ్గా ఈ పొత్తులు, సీట్ల సర్దుబాటు సమయంలో పశ్చిమ బెంగాల్‌లో అధిర్ రంజన్ చౌదరి, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజేశ్ మిశ్రా, గుజరాత్ నుంచి అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ పటేల్ తిరుగుబావుటా ఎగురేశారు.

యూపీలో ఇలా..

2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీ చేయడం ఖరారైంది. సీట్ల పంపకంలో భాగంగా యూపీలోని 80 స్థానాలకు గాను సమాజ్‌వాదీ 63 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. పొత్తుల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లో సమాజ్‌వాదీకి కాంగ్రెస్ ఒక స్థానం కేటాయించింది. అయితే భాదోహి లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని భావించిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాజేష్ మిశ్రా తన స్థానాన్ని సమాజ్‌వాదీకి కోల్పోవాల్సి వచ్చింది. రాజేష్ మిశ్రా ఇప్పుడు రెబల్‌గా మారి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

ఎస్పీ-కాంగ్రెస్ ఒప్పందం జరిగిన వెంటనే రాజేష్ మిశ్రా స్పందించారు. రాజకీయాలంటే ఒకప్పుడు సేవ కోసమని, కానీ ప్రస్తుత కాలంలో రాజకీయాలు వ్యాపారంగా మారాయని ట్వీట్ చేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజేష్ మిశ్రా ఎవరి పేరు నేరుగా ప్రస్తావించకుండానే, పార్టీ నాయకత్వం పట్ల అంకితభావం, విధేయత కంటే సానుభూతి ఎక్కువ అని రాశారు. రాజేష్ మిశ్రా టార్గెట్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్. ఎందుకంటే వారి మధ్య రాజకీయ శత్రుత్వం బహిరంగ రహస్యమే. రాజేష్ మిశ్రా ఇప్పుడు కాంగ్రెస్‌ను వీడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎస్పీతో పొత్తు, సీట్ల పంపకాల విషయంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌లోని చాలా మంది పెద్ద నాయకుల్లో నిరాశ నెలకొంది. ఎస్పీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రవివర్మ, ఆయన కుమార్తె పూర్వీ వర్మలకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. బాగ్‌పథ్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆర్‌ఎల్‌డీలోకి వచ్చిన అహ్మద్‌ హమీద్‌కు కూడా ఎదురుదెబ్బ తగిలింది. అదేవిధంగా సల్మాన్ ఖుర్షీద్ నుంచి జాఫర్ అలీ నఖ్వీ వరకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశలకు గండి పడింది.

ములాయం సింగ్ యాదవ్ కుటుంబంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు వేసిన సుప్రీంకోర్టు న్యాయవాది, కాంగ్రెస్ నేత విశ్వనాథ్ చతుర్వేది కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇప్పుడు తన రాజకీయ మార్గాన్ని ఎంచుకునే సమయం ఆసన్నమైందని అన్నారు. యూపీలో ఎస్పీతో పొత్తు పెట్టుకుని పోరాడుతున్న కాంగ్రెస్ నేతలకు నిరాశే ఎదురైందన్నారు. ములాయం కుటుంబానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తనను ఉపయోగించుకుందని, ఇప్పుడు బహిరంగంగా సొంత రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ పొత్తు వల్ల ఎస్పీ మాత్రమే లాభపడుతుందని, కాంగ్రెస్‌కు ఏమీ దక్కదని అన్నారు.

రెబల్‌గా మారిన అహ్మద్ పటేల్ కొడుకు ఫైసల్?

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల పంపకం దాదాపు ఖాయమైంది. ఢిల్లీతో పాటు గుజరాత్, హర్యానాలలో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. గుజరాత్‌లోని బరూచ్‌ లోక్‌సభ స్థానాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైసల్‌ పటేల్‌ ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. భరూచ్ లోక్‌సభ స్థానం ఆమ్ ఆద్మీ పార్టీకి వెళితే ఆ అభ్యర్థికి మద్దతివ్వబోమని ఫైసల్ పటేల్ స్పష్టంగా చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భరూచ్ నుంచి ఎమ్మెల్యే చైత్ర వాసవను అభ్యర్థిగా ప్రకటించారు. అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ భరూచ్ సీటు కాంగ్రెస్ సంప్రదాయ సీటు అన్నారు. ఆయన తండ్రి అహ్మద్ పటేల్ ఇక్కణ్ణుంచి మూడు సార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. ఆ కారణంగా ఫైసల్ పటేల్‌కు ఈ స్థలంతో భావోద్వేగ సంబంధం ఉంది. 2009 నుంచి భరూచ్ సీటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ సీటును ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అహ్మద్ పటేల్ లేకపోవడంతో భరూచ్ ప్రజల్లో సానుభూతి ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పొత్తు అవసరమే, కానీ కాంగ్రెస్ కూడా తన కార్యకర్తల మనోభావాలను కాపాడుకోవాలని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి భరూచ్ మినహా మరే ఇతర సీటు ఇవ్వవచ్చని సూచిస్తున్నారు.

అధిర్ రంజన్ చౌదరి నిరసన స్వరం

పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిపోరుకు సంకేతాలిచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఆ తర్వాత మెత్తబడి పొత్తును దాదాపు ఖరారు చేశారు. సీట్ల పంపకంపై కూడా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు టీఎంసీ 5 నుంచి 6 సీట్లు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మాత్రం ఈ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తన అభీష్టానికి విరుద్ధంగా పార్టీ అధిష్టానం వ్యవహరిస్తుండడం ఆయనకు నచ్చడం లేదు. ఈ పరిస్థితుల్లో అధిర్ రంజన్ చౌదరి కాంగ్రెస్‌ను వీడాలన్న ఆలోచనలో ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నేత మిలింద్ దేవరా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)లో చేరారు. తాను పోటీ చేస్తున్న స్థానం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేనకు దక్కడం వల్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్నారని అందరికీ తెలిసిన విషయమే.

ముంబై సౌత్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌తో ఉంటే మిలింద్ దేవరా ఆ పార్టీని వీడి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరే పరిస్థితి వచ్చేది కాదు. దేవరా కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం పార్టీకి పెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే అతని కుటుంబానికి ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నాయి. అలాంటి నేత వీడి వెళ్లిపోగా, మహారాష్ట్ర కాంగ్రెస్‌లో దిగ్గజ నేత అశోక్ చవాన్ ఇప్పటికే బీజేపీలో చేరి పెద్దల సభలో చోటు సంపాదించారు.

కాంగ్రెస్ వీడి వచ్చే పెద్ద నేతలకు బీజేపీలో పదవులు, బాధ్యతలు కూడా దక్కుతుండడంతో అసమ్మతి నేతలు, ధిక్కార స్వరం వినిపిస్తున్నవారు బీజేపీలో తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతోంది. బుజ్జగించి సర్దిచెప్పినా ఎంతమంది నేతలను పార్టీ వీడకుండా ఆపగలం అన్న విషయంపై కాంగ్రెస్ నాయకత్వానికే నమ్మకం లేదు. అలా మొత్తంగా పొత్తులు, సీట్ల సర్దుబాట్లు కాంగ్రెస్ నాయకత్వానికి కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement