ఈ ఆర్ధిక సంవత్సరం రెండో అర్ధ సంవత్సరంలో ఇ-వేలం ద్వారా 50 మిలియన్ టన్నుల బొగ్గును విక్రయించాలని కోల్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. 2022-23 ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో 30 మిలియన్ టన్నుల బొగ్గును విక్రయించింది. రెండో ఆర్ధ సంవత్సరంలో 50 మిలియన్ టన్నులు టార్గెట్‌గా పెట్టుకుందని కోల్ ఇండియా ఛైర్మన్ ప్రమోద్ అగర్వాల్ చెప్పారు. సీఐఐ నిర్వహించిన గ్లోబల్ మైనింగ్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు.
కోల్ ఇండియా 2021-22 సంవత్సరంలో ఇ-వేలం ద్వారా 108 మిలియన్ టన్నుల బొగ్గును విక్రయించినట్లు తెలిపారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 10.36 మిలియన్ టన్నుల బొగ్గును కోల్ ఇండియా విక్రయించింది. టన్నుకు సరాసరి ధర 6,061 రూపాయలు వచ్చింది. ఒప్పందం ప్రకారం పొడి ఇంధనం కోసం కోల్ ఇండియా సెప్టెబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో 141 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసింది. ఈ బొగ్గుకు సరాసరి ధర టన్నుకు 1413 రూపాయలు వచ్చిందని ఆయన తెలిపారు. బొగ్గు ఉత్పత్తి కంటే తరలించడమే పెద్ద సవాల్‌గా ఉందని చెప్పారు. వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో బొగ్గు తరలింపు కార్యక్రమాన్ని చాలా వరకు యాంత్రీకరణ చేయనున్నట్లు ఛైర్మన్ వెల్లడించారు. దేశ ప్రగతిలో మైనింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.