Friday, November 22, 2024

యూనివర్సిటీల్లో కోచింగ్‌ సెంటర్లు.. పోటీ పరీక్షలకు ఫ్రీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్స్‌, పోలీస్‌, ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, బ్యాంక్‌ ఎగ్జామ్స్‌ పోటీ పరీక్షలకు ఏటా లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్‌ అవుతూ ఉంటారు. తమ కలల కొలువును సాకారం చేసుకోవడానికి రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్‌ సెంటర్లలో కోచింగ్‌ తీసుకుంటూంటారు. ఏళ్ల తరబడి ప్రిపేర్‌ అవుతూ ఉంటారు. కొంత మంది కోచింగ్‌కు డబ్బులులేక స్వతహాగానే సన్నద్ధమవుతుంటారు. కొంత మంది ప్రిపరేషన్‌ను మధ్యలోనే ఆపేస్తారు. ఇలాంటి అభ్యర్థులకోసం రాష్ట్రంలోని 6 ప్రధాన యూనివర్సిటీలైన ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీలు ఉచిత కోచింగ్‌ను త్వరలో ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ సివిల్‌ సర్వీస్‌ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మిగతా 5 వర్సిటీలు కూడా తమ వర్సిటీల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ఉద్యోగ పోటీ పరీక్షలకు కోచింగ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించినట్లుగా సమాచారం. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), బ్యాంకు ఎగ్జామ్స్‌ (ఐబీపీఎస్‌), తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు సంబంధించిన నియామక పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించనున్నాయి.

బడ్జెట్‌ కేటాయించగానే షురూ…

రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వేల పోస్టులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్‌ను వేయాలని యోచిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వర్సిటీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఆయా వర్సిటీలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. బడ్జెట్‌ను కేటాయించిన తర్వాత పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నట్లు ఉస్మానియా వర్సిటీ ఓ అధికారి తెలిపారు. అయితే కొన్ని వర్సిటీల్లో విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చేందుకు వర్సిటీ ఫ్యాకల్టిd, మౌలికసదుపాయాలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు సమాచారం.

బ్యాచ్‌ల వారీగా…

కాకతీయ వర్సిటీ క్యాంపస్‌లో 200 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు పోలీస్‌ ఉద్యోగాలకు కోచింగ్‌ ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. శాతవాహన వర్సిటీలోనూ విద్యార్థులకు అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్‌ అందించనున్నారు. అయితే అవసరమైన నిధులను మంజూరు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలికి వర్సిటీ అధికారులు కోరినట్లు తెలిసింది. ప్రస్తుతానికైతే ఎలాంటి స్క్రీనింగ్‌ టెస్టు లేకుండానే కోచింగ్‌ ఇవ్వాలని వర్సిటీలు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే కాకతీయ వర్సిటీ సైతం సుమారు 200 మంది విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చేందుకు చర్యలు చేపడుతోంది. దరఖాస్తుల సంఖ్యను బట్టి విద్యార్థులకు బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. యూనివర్సిటీ ఫ్యాకల్టితో పాటు ఆయా సబ్జెక్టుల్లో నిపుణులతో కోచింగ్‌ ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement