Tuesday, November 19, 2024

Delhi | కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు.. రైల్వే మంత్రితో భేటీ అనంతరం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను త్వరలో ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ ఎంపీ (నల్గొండ) ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కేంద్ర మంత్రిని కలిసి తన నియోజకవర్గం పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్టులపై వినతి పత్రం అందజేశారు. అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నేలకొండపల్లి, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచెర్ల మీదుగా డోర్నకల్ నుంచి మిర్యాలగూడకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరినట్టు చెప్పారు. ఈ మార్గంలో రైస్ మిల్లులు, సిమెంట్ ఫ్యాక్టరీలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఆర్థికంగా రైల్వేకు ఈ మార్గం లాభదాయకమని సూచించినట్టు చెప్పారు.

ఈ ప్రతిపాదిత కొత్త లైన్ గురించి ఇప్పటికే సర్వే జరిగిందని, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) త్వరగా పూర్తి చేసి నిర్మాణ పనులకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని కోరినట్టు చెప్పారు. మరోవైపు మోటమర్రి – జగ్గయ్యపేట – మేళ్లచెరువు – జాన్‌పాడు – వాడపల్లి – విష్ణుపురం మార్గంలో ప్రయాణికుల రైళ్లను ప్రవేశపెట్టాలని కోరినట్టు చెప్పారు. ఈ మార్గంలో పలు సిమెంట్ కంపెనీలున్నాయని, కార్మికులు, ప్రజల రాకపోకలకు ఈ మార్గం ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదే మార్గంలో 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందని, అక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే సమయానికి తగినంత బొగ్గు రవాణా చేయాల్సి ఉంటుందని, అయితే ప్రస్తుత లైన్ గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నందున భవిష్యత్తు అవసరాలు తీర్చలేదని వివరించారు. ఈ పరిస్థితుల్లో తక్షణమే లైన్ డబ్లింగ్ పనులు ప్రారంభించక తప్పని పరిస్థితి నెలకొందని అన్నారు.

మరోవైపు త్వరలో ప్రారంభించనున్న సికింద్రహాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు తన నియోజకవర్గం మీదుగా ప్రయాణించే నారాయణాద్రి, విశాఖ ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు నల్గొండ, భువనగిరి పట్టణాల్లో ‘హాల్ట్’* ఏర్పాటు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. తన నియోజకవర్గంలోని ప్రాజెక్టులతో పాటు విభజన చట్టంలో పొందుపర్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి కూడా రైల్వే మంత్రితో మాట్లాడానని ఉత్తమ్ చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని, బహుశా ప్రధాన మంత్రి తెలంగాణ పర్యటన సందర్భంగా ఏదైనా ప్రకటన ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే నల్గొండ మీదుగా ప్రయాణించే ప్రతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు కచ్చితంగా హాల్ట్ కల్పిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, అలాగే వాణిజ్య పట్టణంగా ఉన్న మిర్యాలగూడలోనూ హాల్ట్ కల్పించే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement