Wednesday, November 20, 2024

సీఎం నోట విశాఖ మాట సుప్రీంను ఎద్దేవా చేయడమే.. ఎంపీ జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నమే రాష్ట్ర రాజధాని అంటూ దేశ రాజధానిలో ప్రకటించడం న్యాయవ్యవస్థను ఎద్దేవా చేయడమేనని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో విశాఖ పాలనా రాజధానిగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నప్పటికీ సీఎం జగన్ మాత్రం విశాఖపట్నం మాత్రమే ఏకైక రాజధాని అన్న రీతిలో మాట్లాడారని తెలిపారు. అమరావతి రైతుల మనోభావాలకు సంబంధించిన అంశంపై సీఎం ఇలా మాట్లాడ్డం తగదని చెప్పారు. న్యాయస్థానాన్ని అవహేళన చేయడం కోసమా లేక ప్రభావితం చేయడం కోసం ఈ వ్యాఖ్యలు చేశారా చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

- Advertisement -

విశాఖపట్నం స్వతహాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌లా ముందుకెళ్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అక్కడ పాలనాపరమైన నాలుగు భవనాలు కట్టినంత మాత్రం ఒరిగేదేమీ లేదని, నిజానికి ఆ నగరానికి కావాల్సింది అన్ని రంగాల అభివృద్ధి అని సూత్రీకరించారు. ఇప్పటి వరకు జరిగిన విశాఖ నగరాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రమే లేదని, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ పరిశ్రమలు, రక్షణ సంస్థల కారణంగానే అభివృద్ధి చెందిందని జీవీఎల్ వివరించారు. ఐటీ రంగంలో తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఐటీ వృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు విస్తృత అవకాశాలున్నాయని.. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహాయం లేదని ఆరోపించారు. ఇంకా అనేక ప్రాజెక్టులు, సంస్థల ఏర్పాటుకు కేంద్రం ముందుకొచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని తెలిపారు.

మరోవైపు విభజన సమస్యల పరిష్కారం గురించి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. 2 తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 29 సమావేశాలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. నిజానికి అవన్నీ రెండు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటనే పరిష్కారమవుతాయని, కానీ ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అంటే భయమా లేక స్నేహమా అన్నది స్పష్టం చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

అల్లరి తప్ప విషయం ఉండదు ప్రతిపక్షాల తీరుపై అసహనం

పార్లమెంట్ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంలో తప్పులేదని, కానీ వారికి నిజంగా చర్చ జరగడం ఇష్టం ఉందని జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేవలం గోల చేయడం, అల్లరి సృష్టించడం మాత్రమే వారి లక్ష్యమని విమర్శించారు. ఏ అంశంపైనైనా చర్చకు తాము సిద్ధమని, కానీ విషయం ఏదీ లేకుండా వాదనకు దిగడం ప్రతిపక్షాలకే చెల్లుతుందని అన్నారు. హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చ గురించి స్పందిస్తూ.. ఓవైపు ప్రపంచమంతా ఆర్థికంగా అతలాకుతలమవుతూ ఉంటే స్థిరమైన వృద్ధిరేటుతో బలమైన ఆర్థిక శక్తిగా భారతదేశం నిలబడుతోందని, ప్రతిపక్షాలకు ఇది మాత్రం కనిపించదని అన్నారు.

పదేళ్ల క్రితం ఆర్థికంగా 11వ స్థానంలో ఉన్న దేశాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొద్ది నెలల క్రితం యూకేను అధిగమించి 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలబెట్టిందని గుర్తుచేశారు. 2030 నాటికి 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని తెలిపారు. కోవిడ్ కారణంగా ఆర్థిక రంగంలో ప్రపంచదేశాలన్నీ కుదేలైతే.. భారత్ మాత్రమే అత్యధిక వృద్ధి రేటు సాధించి.. బ్రైట్ స్పాట్ గా నిలిచిందని అన్నారు. ప్రభుత్వ విజయాలను ప్రపంచమే గుర్తిస్తుంటే, రాజకీయాలు మాత్రమే చేసే ప్రతిపక్షాలు గుర్తించకపోవచ్చునని కానీ ప్రజలు గుర్తిస్తారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. దేశాన్ని వృద్ధిపథంలో మరింత వేగంగా తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉంటుందని జీవీఎల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement