Thursday, December 12, 2024

AP | విజయవాడలో సీఎం ప‌ర్య‌ట‌న‌.. ట్రాఫిక్ ఆంక్ష‌లు

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (శుక్రవారం) విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సంద‌ర్భంగా ఇందిరా గాంధీ స్టేడియంలో అత్యంత వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమంలో పాల్గొని అక్క‌డే ఏర్పాటు చేసిన‌ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.

కాగా, స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరుకానున్నారు. సుమారు 500 బస్సులు ఏర్పాటు చేసి వారిని సభా స్థలానికి అధికారులు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

  • విజయవాడలోకి భారీ వాహనాలు రాకుండా నగరం వెలుపల నుంచే వాటి రాకపోకలను నియంత్రించనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్, గుడివాడ, పామర్రు అవనిగడ్డ మీదుగా మళ్లించనున్నట్లు చెప్పారు.
  • చెన్నై- హైదరాబాద్ వెళ్లే వాహనాలను మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, నల్గొండ మీదుగా హైదరాబాద్‌కు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
  • హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను మైలవరం, జి.కొండూరు, నూజివీడు మీదుగా మళ్లించనున్నారు. విజయవాడలోకి వచ్చే ఆర్టీసీ బస్సులను సైతం వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
  • ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ మహాత్మా గాంధీ రోడ్‌లో బస్సులు, ఆటోలకు అనుమతి లేదని వెల్లడించారు.
  • సభా స్థలం ఇందిరా గాంధీ స్టేడియానికి వచ్చే వాహనాల కోసం 24 చోట్ల ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను కల్పించినట్లు అధికారులు తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్‌-2047కు అనుమతించిన వాహనాలు తప్పితే ఇతర వాహనాలకు ఎంజీ రోడ్డులోకి అనుమతి లేదని అధికారులు చెప్పారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement