హైదరాబాద్ శివారులోని ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి గ్రీన్ ఫార్మా సిటీ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు.
కాగా, ఔషధాల తయారీ కంపెనీలు, బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాప్‌గా ఉండాలని అభిప్రాయపడ్డారు. గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
గ్రీన్ ఫార్మా సిటీని పూర్తిగా కాలుష్య రహితంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని అన్నారు.
పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిశ్రమల అభివృద్ధి జరగాలన్నారు. గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, త్వరలోనే ఆయా కంపెనీలతో టచ్‌లో ఉంటామని సీఎం చెప్పారు.