సీఎంఆర్ కాలేజీలోని ఉమెన్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో గుర్తుతెలియని దుండగులు కెమారాలు పెట్టి వీడియో తీశారనే ఆరోపణలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. దీంతో కళాశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై నిన్న(బుధవారం) రాత్రి విద్యార్థినులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. విద్యార్థుల ఆరోపణలతో హాస్టల్ వార్డెన్ పృతీరెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేయగా.. తాజాగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ చేపట్టాం. బాత్రూమ్ కిటికీల వద్ద వేలిముద్రలు సేకరించి సాంకేతిక ఆధారాల కోసం అన్వేషిస్తున్నాం. హాస్టల్ సిబ్బందిపై విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. సిబ్బంది మొబైల్ ఫోన్లను పరిశీలించి ఎలాంటి రికార్డింగ్‌లు ఉన్నాయో తెలుసుకుంటాం. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్ !
ఈ కేసును రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించింది. సీఎంఆర్ కాలేజికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. సీఎంఆర్ మహిళా కాలేజీ హాస్టల్లో బాత్రూంలోని దృశ్యాలను చిత్రీకరించిన అంశంపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని మహిళా కమిషన్ ఆదేశించింది.