దక్షిణ భారత ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్ పవర్ స్టేషన్ల డిమాండ్ మేరకు తగినంత సరిపడా బొగ్గును సరఫరా చేయాల్సిన బాధ్యత సింగరేణిపై ఉందని… దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెలలో రోజుకు 2 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా చేయాలని ఏరియా జీఎంలను కంపెనీ చైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ ఆదేశించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో శుక్రవారం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు..
రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి , రవాణా
ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో 21.65 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా…. 20.94 మిలియన్ టన్నుల మేరకు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించామని పేర్కొన్నారు. జులై నెలలో కురిసిన వర్షాలకు ఉత్పత్తి గణనీయంగా తగ్గిందన్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రతి రోజు విలువైనదేనని…. ఈ ఏడాది నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకువడానికి రోజుకు 2 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా జరిగేలా చూడాలని కోరారు.
ఓవర్ బర్డెన్ తొలగించాలి..
అలాగే 13.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించేందుకు ఓబీ కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి ఓబీ లక్ష్యాలపై ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా ఉత్పత్తికి కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ గనుల్లో నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించి ఉత్పత్తికి విఘాతం లేకుండా చూడాలన్నారు. ఒకవైపు వర్షాకాలంలో లోటును భర్తీ చేస్తూనే ఈ నెలలో ఇచ్చిన లక్ష్యాలను కూడా దాటి ఓవర్ బర్డెన్ తొలగించాలని సూచించారు.
రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యం
ఉత్పత్తి లక్ష్యాల సాధనలో రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని సీఎండీ ఎన్.బలరాం స్పష్టం చేశారు. భూగర్భ గనులతోపాటు ఉపరితల గనుల్లో కూడా అధికారులు, సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తిని సాధించాలని పేర్కొన్నారు. అలాగే, ఉద్యోగులు కూడా భద్రతా సూత్రాలను పాటించాలని, తమను తాము రక్షించుకోవడం మరచిపోవద్దని, అసురక్షిత ప్రదేశాలను కనిపిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో డైరెక్టర్ (ఇ&ఎం) డి సత్యనారాయణరావు, డైరెక్టర్ (ఆపరేషన్స్, పర్సనల్) ఎన్వికె శ్రీనివాస్, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) జి. వెంకటేశ్వర్ రెడ్డి, జీఎం (కోఆర్డినేషన్) జి. దేవేందర్, జీఎం (సీపీపీ) జక్కం రమేష్, జీఎం(సేఫ్టీ) సుభాని, జీఎం(ఎంపీ) సుబ్బారావు, కార్పొరేట్ జీఎంలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.