పర్యావరణహిత సుస్థిర మైనింగ్ తో పాటు సంప్రదాయేతర విద్యుత్ రంగంలో కూడా విశేషమైన సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా సింగరేణికి జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
భారత దేశం, దక్షిణాసియాలో సుస్థిర ఇంధన, పునరుద్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న సంస్థలను ఎనర్షియా ఫౌండేషన్ వారు ఎంపిక చేసి ప్రతీ ఏడాది పురస్కారాలను ప్రదానం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు.
ఈ ఏడాది “ఇండియాస్ బెస్ట్ అండ్ మోస్ట్ సస్టేనబుల్ కోల్ మైనింగ్ ఆపరేటర్ విత్ రెన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్” కేటగిరీలో సింగరేణిని అత్యుత్తమ సంస్థగా ఎంపిక చేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఈనెల 20వ తేదీన ఎనర్షియా ఫౌండేషన్ విశాఖపట్నంలో నిర్వహించే తమ జాతీయ స్థాయి 17వ బహుమతి ప్రదానోత్సవ వేడుకలలో సింగరేణికి అందజేయనున్నారు.
ఎనర్షియా ప్రకటించిన ఈ జాతీయ స్థాయి అవార్డు సింగరేణి సంస్థ చేపడుతున్న పర్యావరణహిత చర్యలకు గుర్తింపు వంటిదని, సింగరేణి సంస్థ ఈ స్ఫూర్తితో తన పర్యావరణ చర్యలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు పోతుందని సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ తన హర్షం ప్రకటించారు.