Sunday, December 1, 2024

TG | ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం సమీక్ష..

వచ్చే యాబై ఏళ్ళ అవసరాలకు సరిపడేలా ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం ఉండాలని.. నాణ్యత విషయంలో ఎక్కడా లోపం లేకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రిని భావితరాలకు అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించేలా తీర్చి దిద్దాలని స్పష్టం చేశారు.

ఆదివారం హైదరాబాద్‌లో ఉస్మానియా ఆసుపత్రి పనులకు సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రహదారులపై ఆయన పలు కీలక సూచనలు చేశారు.

ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు.. తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజీ తదితర పనుల కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అందుకోసం అన్ని శాఖలతో సమన్వయం కోసం నోడల్‌ ఆఫీసర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దాన కిషోర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు.

ఉస్మానియా ఆసుపత్రిని గోషా మహాల్‌ స్టేడియంకు తరలించాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని తాజాగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన అధికారులకు సూచించారు.

రాబోయే 50 ఏళ్ల అవసరాలను బేరేజు వేసుకుని కొత్త ఆసుపత్రికి రూపకల్పన చేయాలన్నారు. ఆసుపత్రికి నాలుగు వైపులా రహదారులు ఉండేలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని తెలిపారు. ఈ మేరకు రహదారుల విస్తరణకు వెంటనే సర్వే పనులను ప్రారంభించాలని సీఎంగారు ఆదేశించారు.

- Advertisement -

కాగా, గోషామహాల్‌లో దాదాపు 32 ఎకరాల్లో పోలీస్‌ స్టేడియం, పోలీస్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో కొత్త ఆసుపత్రిని నిర్మించాలని.. అందుకు సంబంధించిన స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదిలి చేయాలని అధికారులకు గతంలో సీఎం ఆదేశించారు. ఇక పోలీస్‌ స్టేడియం వైద్య ఆరోగ్య శాఖకు బదలాయించడంతో.. ప్రత్యామ్నాయ స్థలాన్ని పోలీస్‌ శాఖకు కేటాయించాలని సీఎం ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌తోపాటు- పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement