ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ టీమ్ శుక్రవారం సింగపూర్ లో పర్యటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బృందం సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) క్యాంపస్‌ను సందర్శించింది. అక్కడ స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు, అధునాతన సౌకర్యాలు పరిశీలించింది.
అక్కడ శిక్షణ అందిస్తున్న సుమారు 20 రంగాలకు చెందిన నిపుణులు, కళాశాల సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ఐటీఈ సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… యువతకు వివిధ రంగాల్లో ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును వివరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌లో భాగస్వామ్యం కోసం పరస్పర సహకారం అందించాలని కోరారు.
ఈ మేరకు ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. చర్చల తర్వాత, నైపుణ్యాభివృద్ధిలో కలిసి పనిచేయడానికి ఐటీఈ, స్కిల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. దీంతో ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలో హైదరాబాద్‌కు రానుంది.
ఈ బృందంలో సీఎం రేవంత్ వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ వీఎల్‌వీ ఎస్‌ఎస్ సుబ్బారావు ఉన్నారు.