Sunday, November 24, 2024

TG | స్పోర్ట్స్‌ పాలసీ సీఎం రేవంత్ స‌మీక్ష‌…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా నూతన క్రీడా విధానాన్ని (స్పోర్ట్స్‌ పాలసీ) సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

2036లో జరిగే ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని క్రీడా పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. నూతన క్రీడా విధానానికి సంబం ధించి అధికారులు రూపొందించిన ముసాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమావేశమై సమీక్షించారు.

ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, జితేందర్‌ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, క్రీడలు, యువజన అభ్యున్నతి శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్‌, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం కార్యదర్శి షానవాజ్‌ ఖాసీం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను ప్రధానంగా చర్చించారు. వివిధ క్రీడల్లో ప్రతిభ ఉన్న యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ- పడే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా ఎంచుకుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అనుసరించాల్సిన అత్యుత్తమ విధానాలను క్రీడా పాలసీలో పొందుపరచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న క్రీడా విశ్వవిద్యాలయాన్ని (స్పోర్ట్స్‌ యూనివర్సిటీ) యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు.

- Advertisement -

యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్‌ యూనివర్సిటీని పీపీపీ పద్ధతిన ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేకంగా పాలక మండలిని (బోర్డు) ఏర్పాటు చేసి ఛైర్మన్‌ను నియమించాలని, యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా బాధ్యతలు అప్పగిం చాలని సూచించారు.

స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో దాదాపు 13 కోర్సులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయిం చారు. క్రికెట్‌, హాకీ, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, స్విమ్మింగ్‌, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌, టేబుల్ టెన్నిస్‌, అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌, అక్వాటిక్స్‌ లాంటి 14 క్రీడలను స్పోర్ట్స్‌ హబ్‌లో పొందుపరిచారు. గచ్చిబౌలి స్పోర్ట్స్‌ స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ-ని ప్రారంభించాలని చెప్పారు.

దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో ఇప్పటికే వివిధ క్రీడలను నిర్వహించేందుకు అన్ని సదుపా యాలున్నాయని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వాటిని అధునాతనంగా అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని సూచిం చారు. హైదరాబాద్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రముఖ క్రీడా మైదానాలు, స్టేడియంలు అన్నింటినీ స్పోర్ట్‌ హబ్‌ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్‌ స్డేడియం, సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియం, యూనివర్సిటీ సైక్లింగ్‌ వెలోడ్రమ్‌ లాంటివన్నింటినీ గుర్తించి.. ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించటం నుంచి వారికి చదువులకు ఆటంకం లేకుండా.. అటు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన ప్రావీణ్యం కల్పించే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లన్నీ పరిష్కరించేలా కొత్త పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మన ప్రాంతంలో ఉన్న భౌగోళిక పరిస్థితులతో పాటు.. మన ప్రాంత యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకే ప్రాధాన్యమివ్వాలని కోరారు. దేశ విదేశాల్లో ఉన్న శిక్షకులు(కోచ్‌)లను రప్పించాలని, అక్కడున్న యూనివర్సిటీల సహకారం తీసుకునేలా ఎంవోయూలు చేసుకోవాలని చెప్పారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏ స్థాయి పోటీల్లో విజయం సాధించినవారికి ఎంత ప్రోత్సాహకం అందించాలి?, ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి?.. అనే మార్గదర్శకాలను ఖరారు చేయాలని అధికారులను కోరారు. క్రీడా విధాన ముసాయిదాకు సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు మార్పులు చేర్పులను సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement