Saturday, November 23, 2024

TG | మహబూబ్‌నగర్‌ రైతు బహిరంగ సభపై సీఎం రేవంత్‌ సమీక్ష !

ప్రజా ప్రభుత్వ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30 మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రైతుల కార్యక్రమాన్ని బహిరంగ సభలా కాకుండా వారికి అవగాహన కల్పించే రైతు సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆధునిక సాగు పద్ధతులు, మెళకువలపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంగా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు.

వ్యవసాయ శాఖ, ఈ నెల 30వ తేదీన మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రైతు సదస్సు వంటి అంశాలపై ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎంగారు మాట్లాడుతూ..

- Advertisement -

ఈ సదస్సులో రాష్ట్రంలోని రైతులు పెద్ద ఎత్తున పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. ఆధునిక పరికరాల వినియోగం, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్ల వాడకం వంటి సాంకేతిక పరికరాలన్నింటినీ సదస్సు నిర్వహించే చోట ప్రయోగాత్మకంగా ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాల‌ని అన్నారు.

విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ ఫామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, రైతులకు ఉపయోగపడే విధంగా ఇటీవలి కాలంలో వివిధ కంపెనీల వినూత్న ఉత్పాదనలన్నీ స్టాళ్లలో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.

రైతుల్లో అవగాహన పెంచడానికి వీలుగా సదస్సును ఒకరోజు కాకుండా 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించేలా స్టాళ్లను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలని… తద్వారా రైతులు దేశంలో వ్యవసాయ సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకునేలా ఈ సదస్సు ఉపయోగపడాలని సీఎం సూచించారు.

సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement