Saturday, January 11, 2025

TG | ఎక్సైజ్ శాఖపై సీఎం రేవంత్ స‌మీక్ష‌..

  • కంపెనీల ఒత్తిడికి తలొగ్గొద్దు..
  • కొత్త కంపెనీల నుండి దరఖాస్తులను స్వీకరించండి
  • ఇతర రాష్ట్రాల్లో బీర్ల‌ ధరలను పరిశీలించండి
  • ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ నివేదిక ఆధారంగా ధరలు
  • గత ప్రభుత్వ బకాయిలను క్రమంగా క్లియర్ చేయాలి

రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక ప్రక్రియను అనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, కనీసం నెలరోజుల పాటు నిర్ణీత గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఈ మేరకు ఎక్సైజ్ శాఖపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ….

ఇప్పటికే తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీజీబీసీఎల్)కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లను సరఫరా చేసేందుకు సులభ వాణిజ్య విధానాన్ని అనుసరించాలన్నారు. ఆయా కంపెనీలు తమ బ్రాండ్ పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని, కంపెనీల నాణ్యతా ప్రమాణాలు, సరఫరా సామర్థ్యాన్ని పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలన్నారు.

ఇటీవల యునైటెడ్ బెవరేజెస్ కంపెనీ.. బీర్ల‌ రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి తెచ్చిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని…. ఇత‌ర‌ రాష్ట్రాల్లో బీర్ల ధరలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఏడాది కాలంగా ఎక్సైజ్ శాఖ ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తుండగా.. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను క్రమంగా క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement