- బీఆర్‌ఎస్ నేతల తాజా అరెస్ట్‌లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహల్స్ పోలీసు స్టేషన్‌లో చేసిన హడావుడి, మాజీ మంత్రి హరీష్ రావును అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఉంచడం, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల గృహ నిర్బంధాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని ఇందుకు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తోన్న విజయోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడారు. పోలీసు స్టేషన్ కు వచ్చి ఝులుం ప్రదర్శిస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని వారిని ఎటువంటి పరిస్థిల్లోనూ వదిలిపెట్ట వద్దని రేవంత్ హెచ్చరించారు.
ఫిర్యాదు చేసేందుకు పోలీసుల చెంతకు వచ్చే వారిని గౌరవించాలని మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలని వారు అమర్యాదగా వ్యవహరిస్తే వెనకా ముందు చూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులెవరైనా సరే ఎంతటి వారైనా సరే పోలీసుల పట్ల మర్యాదగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు.నేరగాళ్లకు హోదాలు ప్రొటొకాల్స్ ఉండవని ఆయన ఈ సందర్బంగా చెప్పారు.