Friday, September 20, 2024

TG | ఫీజు రియంబర్స్ మెంట్ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి.. ఎలాంటి పెండింగులు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ‘నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంజినీరింగ్ కళాశాలలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

దేశంలో తొలిసారిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు. ఇక బకాయిలను కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసేలా.. మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ విషయంపై ఆర్థిక శాఖతో మాట్లాడి.. ఓ కొలిక్కి తీసుకొచ్చేలా చూడాలని శ్రీధర్ బాబుకు విన్నవించారు.

ఇక అభివృద్ధి చెందుతున్న దేశానికి సివిల్ ఇంజినీరింగ్ అత్యంత అవసరం. కొన్ని కళాశాలల్లో ఆ కోర్సు లేకుండా చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను కచ్చితంగా నడపాలి. ఈ కోర్సులు లేకుంటే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది.

విద్యా సంస్థలు పట్టాలు చేతిలో పెట్టి నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా మారడం తమ ప్రభుత్వానికి ఏమాత్రం సమర్థనీయం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో కాలేజీలు ప్రపంచ అవసరాలకు తగినట్టుగా సరికొత్త ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. అందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

- Advertisement -

ఫార్మా, ఐటీ తర్వాత ఏఐ ప్రపంచానికి నడిపించబోతోందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఏఐకి సంబంధించిన కోర్సును ప్రవేశపెట్టాలని… ఇందుకు ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంతో పోటీపడేలా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు.

ఇంజనీరింగ్ విద్యను మరింత పటిష్టం చేసి, ఉన్నత నాణ్యతా ప్రమాణాల స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రాథమిక స్థాయిలో 65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్న విషయాన్ని వివరించారు.

తెలంగాణ ఆకాంక్షకు ప్రధాన కారణమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కంకణబద్ధమై ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు చిక్కులు, ఇతర గందరగోళాలను పరిష్కరించి ఇప్పటిదాకా 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు.

టీజీఎస్‌పీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతోందని.. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ ప్రక్రియలోనూ నిబంధనల ప్రకారం, కోర్టు చిక్కులు తలెత్తకుండా, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, విద్యాశాఖ కార్యదర్శి, జెన్‌టీయూ ఇంచార్జి వైస్ ఛాన్సలర్ బుర్రా వెంకటేశం, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement